రుణమాఫీ.. అంతా కిరికిరి
అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం.. ఇది ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వాగ్దానం. బాబు మాటను నమ్మి రైతులు ఓట్లేసి అధికారం కట్టబెట్టారు. ప్రమాణస్వీకారం చేసిన రోజే రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తారని ఎదురు చూసిన రైతులకు తీవ్ర నిరాశ మిగిలింది. రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై కమిటీ పేరుతో కాలయాపన చేస్తుండటంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రుణమాఫీ కాక.. కొత్త రుణాలు దొరకక రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు.
కడప అగ్రికల్చర్: ‘ఏరు దాటేంతవరకు ఓడమల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న సామెత చందంగా తయారైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి. పంట రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోజుకో మాట మాట్లాడటం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పమాణం స్వీకారం చేసేటప్పుడే రుణమాఫీ పైలుపై సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు ప్రమాణం స్వీకారం పూర్తికాగానే రుణమాఫీపై సాధ్యాసాధ్యాల అమలుకు కమిటీ వేయడం దేనికని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ అంత సులువు కాదని ఒక మంత్రి, ఆరు నూరైనా రుణమాఫీ చేసి తీరుతామని మరోమంత్రి, అన్నీ ఆలోచించి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్న తరువాతనే మాఫీ ఉంటుందని ఇంకో మంత్రి, లక్షల కోట్లు ఖర్చయినా వెనకడుగు వేయమని, ఆర్‌బీఐ ఒప్పుకోలేదని, బ్యాంకులు ఎప్పుడూ మాఫీ ఒప్పుకోవని, అది మామూలేనని, మహిళల పేరుతో పంటల కోసం బంగారు తాకట్టుపెట్టి తెచ్చిన బకాయి మాత్రమే మాఫీ చేస్తామని, పంట రుణం ఎంత ఉన్నా లక్ష రూపాయల వరకే మాఫీ అని ఇలా పలువురు మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో కమిటీ రుణమాఫీపై 15 రోజుల్లో ప్రాథమిక నివేదికను అందజేస్తుందని,అనంతరం 30 రోజుల్లో తుది నివేదిక సమర్పిస్తుందని, అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం ఇప్పటికి 15 రోజులు గడచిపోయాయి. అయినా ప్రాథమిక నివేదిక ఏమీ లేదు.
రేపటి నుంచి విత్తనకాయలు పంపిణీ...
చేతిలో చిల్లి గవ్వలేదు :
చేతిలో చిల్లిగవ్వలేదు. గురువారం నుంచి విత్తనకాయలను పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు.. ఏం పెట్టి విత్తనాలను కొనుగోలు చేయాలని రైతుల నుంచి ఉదయిస్తున్న ప్రశ్న. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటిస్తే మళ్లీ రుణాలు బ్యాంకుల నుంచి తెచ్చుకోవడానికి వీలుంటుందని, ఇప్పుడు బ్యాంకుల వద్దకు వెళితే పాత బకాయి చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలు, ఎరువుల కొనుగోలు ఎలా చేయాలో అర్థం కావడం లేదని చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘పెద్దకారు రైతులకు బయట అప్పులు పుడతాయని మాబోటి వారికి వడ్డీకి డబ్బులు ఎవరు ఇస్తారని’ పెండ్లిమర్రి మండలం మొళ్లకాల్వకు చెందిన చిన్నకారు రైతు వెంకటసుబ్బన్న తెలిపాడు. ‘నిరుడు ఎరువులకు, విత్తన కాయలకు చేసిన అప్పులే తీరలేదని మళ్లీ అప్పు ఇవ్వమని షావుకార్లను ఎలా అడిగేదని’ చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లెకు చెందిన మధ్యకారు రైతు నాగిపోగు గంగాధరరెడ్డి అన్నాడు.
కాలయాపన చేస్తే బీమా కోల్పోతాం..
పంట రుణాలు తీసుకుంటేనే పంటల బీమా వర్తిస్తుంది. ఆగస్టు 30లోగా పంట రుణం తీసుకున్న రైతులు ప్రీమియం చెల్లించడానికి అవకాశం ఉం టుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 45 రోజుల తరువాత తాపీగా సూచనలు, సలహాలు చేసినా...వాటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతు లు బీమా అవకాశాలను కోల్పోతారు.
రైతులు గత ఏడాది తీసుకున్న తేదీకి తిరిగి ఈ ఏడాది అదే నెలలో అదే తేదీన రుణం చెల్లించకపోతే, రద్దు కాకపోతే రైతు 11.75 శాతం వడ్డీ కట్టాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని ఇబ్బందులున్నాయని తెలిసినా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్థం కావడం లేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.