ద్రాక్ష నాణ్యతను పరిశీలిస్తున్న రైతు చంద్ర ప్రకాష్‌రెడ్డి
శింగనమల: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రైతులు సైతం పంటల సాగులో నూతన పంథాను అవలంభిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుపై దృష్టి సారించిన అనంతపురం రైతులు జిల్లాలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ ఆ తరహా పంటలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రైతు చంద్రప్రకాష్‌రెడ్డి (బాబు) సరికొత్త ద్రాక్ష రకాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగదశలోనే ఆశించిన ఫలితాన్ని సాధించారు.
ఆస్ట్రేలియా రకం రెడ్ గ్లోబ్
ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకే పరిమితమైన రెడ్ గ్లోబ్ రకం ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ద్రాక్ష రకాన్ని సాగు చేస్తే ఎలా ఉంటుందని రైతు చంద్రప్రకాష్‌రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా రెడ్ గ్లోబ్ సాగు చేస్తున్న రైతుల గురించి ఆరా తీస్తూ కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి వెళ్లారు. అక్కడ ఓ రైతు సాగు చేస్తున్న రెడ్ గ్లోబ్ ద్రాక్షను పరిశీలించారు. 2019లో రూట్స్ తీసుకొచ్చి నాటారు. 2020లో రెడ్‌గ్లోబ్ అంటు కట్టించారు. ఒక్కొక్క అంటుకు రూ.150 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆరు వేల అంటు మొక్కలు నాటారు. పందిరి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ రకం పంట జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందో.. లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే అనూహ్యంగా పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు వచ్చింది.
ఓ ప్రయోగం చేద్దామనుకున్నా..
రెడ్ గ్లోబ్ ద్రాక్ష రకం గురించి తెలియగానే ఎలాగైనా ఈ పంట సాగు చేయాలని అనుకున్నా. చిక్కబళ్లాపురంలో ఈ పంట సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికెళ్లి చూశాను. ఎర్ర నేలలు అనుకూలమని తెలిసింది. దీంతో నాకున్న 50 ఎకరాల్లో ఓ ఐదు ఎకరాల్లో ప్రయోగం చేద్దామని అనుకున్నా. అంటు మొక్కలు తీసుకొచ్చి ఆరు ఎకరాల్లో నాటాను. పశువుల పేడ ఎరువు వాడాను. దిగుబడి ఆశించిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. ఈ లెక్కన తొలి కోతలో పెట్టుబడులు చేతికి వస్తే.. ఆ తర్వాత వరుస లాభాలు ఉంటాయి. ఆరు నెలల పాటు పంట కోతలు ఉంటాయి. సాధారణంగా మార్కెట్‌లో రెడ్ గ్లోబ్ ద్రాక్ష కిలో రూ.300 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. అయితే జిల్లాలో సరైన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో ముంబయి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మార్కెట్‌కు తరలిస్తున్నా, కిలో రూ.180 నుంచి అమ్ముడుబోతోంది.
– చంద్రప్రకాష్‌రెడ్డి, రైతు, గుమ్మేపల్లి, శింగనమల మం‘‘
Comments
Please login to add a commentAdd a comment