సాక్షి, అమరావతి: ఎంపీడీవోల పాతికేళ్ల కల ఫలించింది. 1996 నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు ఒకేసారి 236 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 మందిని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోలుగా నియమించగా ఇటీవలే కొత్తగా సృష్టించిన డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులుగా (డీఎల్‌డీవో) మరో 51 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 173 మందికి డీఎల్‌డీవో హోదాలో పదోన్నతి కల్పించి కొంత మందిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ పోస్టుల్లో నియమించింది. ఇప్పటికే డిప్యుటేషన్‌పై వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిలో అర్హత ఉన్న వారిని డీఎల్‌డీవో హోదాలోనే తిరిగి ఆయా పోస్టుల్లో కొనసాగేలా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 224 మంది డీఎల్‌డీవోలుగా పదోన్నతులు పొందారు. రాష్ట్రంలో 660 ఎంపీడీవో పోస్టులు ఉండగా మూడో వంతు మందికిపైగా ఇప్పుడు ఒకేసారి పదోన్నతులు దక్కాయి.
312 మంది.. 13 పోస్టులు
1986లో మండలాల వ్యవస్థ ఏర్పాటు కాగా దీర్ఘకాలం పాటు ఎంపీడీవో పోస్టులకు సర్వీసు రూల్స్ రూపొందించలేదు. 2001లో తొలిసారి ఎంపీడీవో పోస్టులకు సర్వీసు రూల్స్ ఏర్పడాయి. అప్పటివరకు వేర్వేరు శాఖల్లో పనిచేసిన అధికారులను ఇన్‌చార్జి హోదాలో ఎంపీడీవోలుగా నియమించారు. 1999లో తొలిసారి ఎంపీడీవోలను ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా నియమించారు. అయితే సర్వీసు రూల్స్‌కు ముందే 1996– 99 మధ్య పదోన్నతులపై ఎంపీడీవోలుగా నియమితులైన వారికి, డైరెక్ట్‌గా రిక్రూట్ అయిన ఎంపీడీవోల మధ్య సీనియారిటీ విషయంలో వివాదం నెలకొంది. తాజా వివరాల ప్రకారం వీరు 312 మంది వరకు ఉన్నారు. అయితే పదోన్నతులకు ఉన్న పోస్టులు 13 కాగా పోటీపడే ఎంపీడీవోల సంఖ్య 300కిపైగా ఉండటంతో ఇన్నాళ్లూ సమస్య పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
తొలుత కమిటీతో ప్రయత్నం..
ఎంపీడీవోలుగా ఉద్యోగంలో చేరిన వారు ఎలాంటి పదోన్నతులకు నోచుకోకుండా పాతికేళ్లుగా కొనసాగుతుండటంపై ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే దృష్టి సారించారు. సమస్య పరిష్కారానికి తొలుత అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే కమిటీ పలు సమావేశాలు నిర్వహించినా మూడు కేటగిరీలకు సంబంధించిన ఎంపీడీవో ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
పదోన్నతుల కోసమే 200 కొత్త పోస్టులు..
ఐఏఎస్ అధికారుల కమిటీ ఏర్పాటు తర్వాత కూడా ఎంపీడీవోల పదోన్నతుల సమస్య తేలకపోవడంతో దీన్ని పరిష్కరించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో మూడు కేటగిరీల సంఘాల మధ్య ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తూనే వీలైనంత మంది ఎంపీడీవోలకు ఒకేసారి పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా 200 పోస్టులను గుర్తించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక్కో డీఎల్‌డీవో చొప్పున 51 డీఎల్‌డీవో పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది.
వీటికి తోడు కొత్తగా గ్రామీణాభివృద్ధి శాఖలో 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలకు మాత్రమే పదోన్నతులకు వీలు కల్పిస్తూ 2022 జనవరి 17వ తేదీన మరో ఉత్తర్వు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ పథకం విభాగాల్లో 9 కేటగిరీలకు సంబంధించి 15 పోస్టులలోనూ, జిల్లాలోని డ్వామా పీడీ కార్యాలయాల్లో 9 కేటగిరీలకు సంబంధించి మరో 134 కలిపి మొత్తం 149 పోస్టులను ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ విధానంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా భర్తీ చేసేలా ఆదేశాలిచ్చింది.
ఆ ఉద్యోగులకు శుభవార్త.. పాతికేళ్లకు పదోన్నతులు
Published Thu, Apr 14 2022 4:12 AM | Last Updated on Thu, Apr 14 2022 11:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment