విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట కార్మికులు, ఉద్యోగుల నిరసన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ ఉక్కు నగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రజలు భగ్గుమన్నారు. విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కేంద్రమంత్రి ప్రకటనను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు, ఉద్యోగ సంఘాలు విశాఖలో సోమవారం రాత్రి నుంచి చేపట్టిన ఆందోళన మంగళవారమూ కొనసాగింది. వీరికి మద్దతుగా ప్రజాసంఘాలు, వామపక్షాలు, కార్మిక సంఘాలూ రోడ్డెక్కాయి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో జాతీయ రహదారిని నిర్బంధించడంతో వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని మరింత ఉ«ధృతం చేస్తామని పోరాట కమిటీ హెచ్చరించింది. 11న యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వాలని, ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగాలని నిర్ణయించింది.
ఆందోళనలతో వేడెక్కిన విశాఖ..
కేంద్రం తీరుకు నిరసిస్తూ విశాఖ కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద జాతీయ రహదారిపై ఉద్యమకారులు సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. రోడ్డును దిగ్బంధించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రకటనతో కూడిన ప్రతుల్ని దగ్ధం చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. మరోవైపు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడించేందుకు భారీసంఖ్యలో ఆందోళనకారులు తరలివెళ్లారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రధాని డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని ప్రత్యేక బలగాలు, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో తోపులాటలు చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వచ్చిన ఫైనాన్స్ డైరెక్టర్ వి.వేణుగోపాలరావును ఆందోళనకారులు దిగ్బంధించారు. ఆయన కారు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా.. దాడికి యత్నించారు. వారిని పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చెదరగొట్టారు. ఆయనకోసం వచ్చిన హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.బాలాజీని కూడా కార్మికులు దిగ్బంధించారు.
స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలు రోడ్లలో అడ్డంగా చెట్లకొమ్మలు వేశారు. మరికొన్నిచోట్ల టైర్లని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వడ్లపూడి ప్రజలు తమ వీధుల్లోని రహదారుల్ని మూసివేసి కేంద్రాన్ని, బీజేపీ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక చైర్మన్, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలివ్వని బీజేపీ ఉన్నవి అమ్మేయడానికి సిద్ధపడటం దుర్మార్గమన్నారు. బీజేపీని, ఆ పార్టీకి సహకరిస్తున్న జనసేన నేతలను మున్సిపల్ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
నినాదాలతో మార్మోగిన బెజవాడ
బెజవాడ లెనిన్ సెంటర్ మంగళవారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో మార్మోగింది. పలు కార్మిక సంఘాలు మంగళవారం లెనిన్ సెంటర్‌లో ఆందోళన నిర్వహించి కేంద్రప్రభుత్వ జీవోలను దగ్ధం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ప్రజాసంఘాలు, లాయర్లు, రిక్షా కార్మికులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఇంకా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.
ఢిల్లీ వెళ్లొచ్చిన స్టీల్‌ప్లాంట్ సీఎండీ..
కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పిలుపు మేరకు విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్, డైరెక్టర్(పర్సనల్) కేసీ దాస్‌లు సోమవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించిన అనంతరం మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. నేడు అత్యవసర బోర్డు మీటింగ్ నిర్వహించే అవకాశముందని సమాచారం.
11న సమ్మె నోటీసు
ప్రైవేటీకరణ ముప్పు నుంచి స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు అనుసరించాల్సిన ప్రణాళికను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఖరారు చేసింది. 11వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వాలని, 25వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగాలని నిర్ణయించింది. పార్లమెంట్‌లోని వివిధ పార్టీల నేతలకు వినతిపత్రాలు అందజేయాలని, ఈ నెల 20న జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఉక్కు కార్మికుల గర్జన పేరిట స్టీల్‌ప్లాంట్ త్రిష్ణా మైదానంలో బహిరంగసభ నిర్వహించాలని, కిసాన్‌మోర్చా ఢిల్లీ నాయకులతో నగరంలో 28న భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సమావేశంలో కమిటీ నాయకులు సీహెచ్.నర్శింగరావు, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
11 నుంచి ఆందోళన: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలసి ఆందోళన ఉధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మంగళవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. కేంద్రం ప్రకటనను నిరసిస్తూ 11వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వేదిక కన్వీనర్ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు వి.ఉమామహేశ్వరరావు ప్రకటించారు. 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనం, 13, 14 తేదీల్లో ఎంపీలకు సామూహిక వినతిపత్రాలు, 15న రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద విశాఖ స్టీల్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసన దినం జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. 15న వేదిక సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment