16 నుంచి పంటలకొనుగోలు | Purchase of crops from 16th October | Sakshi
Sakshi News home page

16 నుంచి పంటలకొనుగోలు

Published Sun, Oct 4 2020 4:39 AM | Last Updated on Sun, Oct 4 2020 4:39 AM

Purchase of crops from 16th October - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగుల పంటల ఉత్పత్తులు చేతికందివస్తున్న తరుణంలో రైతుల ఆర్థిక పరిస్థితిని అవకాశంగా తీసుకుని వ్యాపారులు మరీ తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తూ రైతులకు దన్నుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో మొక్కజొన్న, సజ్జ, రాగుల ఉత్పత్తుల సేకరణ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీనిపై రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)లోని వ్యవసాయ సహాయకులను కలసి ఈ నెల 15లోగా పేర్లను నమోదు చేసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ పంటల వివరాలను ఈ–కర్షక్‌లో నమోదు చేసుకుంటేనే మద్దతు ధర పొందడానికి వీలవుతుంది. రైతులకిచ్చిన మాట మేరకు సీజన్‌ ప్రారంభం కాకముందే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను ప్రకటించడం విదితమే. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 24 పంటలకు మద్దతు ధర వర్తించేలా నిర్ణయం తీసుకుని, వాటి ధరలకు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించడం తెలిసిందే. 

వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట..
రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగుల ఉత్పత్తులు మార్కెట్లలోకి వస్తున్నాయి. మొక్కజొన్నకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,850 చొప్పున కనీస మద్ద«తు ధర ప్రకటించగా.. మార్కెట్‌లో ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,400 వరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే సజ్జలు క్వింటాలుకు ప్రకటించిన మద్దతు ధర రూ.2,150 ఉంటే మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,500కు మాత్రమే కొంటున్నారు. రాగులకు మద్దతు ధర రూ.3,295గా ఉంటే మార్కెట్‌ ధర రూ.2,600 మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆలంబనగా నిలిచేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నెల 16వ తేదీ నుంచే ఈ పంటల సేకరణ ప్రారంభించాలని నిర్ణయించింది. కాగా, మొక్కజొన్న, సజ్జలు, రాగులకు సంబంధించి ఒకో రైతు నుంచి గరిష్టంగా 100 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని, ఐదెకరాల విస్తీర్ణం కలిగిన రైతు వరకు ఈ పంటలను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. 

ఒకటి నుంచే పేర్ల నమోదు..
రైతు భరోసా కేంద్రాల్లో ఈ నెల 1 నుంచే రైతుల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. రైతులు సాగుచేసిన పంట, సాగు విస్తీర్ణం, రానున్న దిగుబడి తదితర వివరాలు వీటిల్లో ఉంటున్నాయి. అంతేగాక పేర్లను నమోదు చేసుకున్న రైతులను ఏఏ తేదీల్లో పంటలను ఏయే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలో ముందుగానే తెలియపరిచే ఏర్పాటు చేశారు. వారి మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు పంపే ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

రైతులు తొందరపడి పంటను అమ్ముకోవద్దు
రైతులెవరూ తొందరపడి పంటల్ని అమ్ముకోవద్దు. ఈ నెల 16 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నాం. ఈ–కర్షక్‌లో నమోదు చేసుకున్న రైతులనుంచే పంటలను కొనుగోలు చేస్తాం. 
– ప్రద్యుమ్న, మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement