ఒక్క ఆలోచన వేలాది మందికి తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందేలా చేసింది. అందరి చూపు ఆ మార్ట్‌పై నిలిచేలా పనితీరుతో ఆకట్టుకుంటోంది. ఎవరిపైనా పెట్టుబడి భారం పడకుండా చిన్నపాటి మొత్తంతో డ్వాక్రా సభ్యులే అంతాతామై నిర్వహించేలా ఆవిర్భవించిన జగనన్న మహిళా మార్ట్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.పేద ప్రజలకు తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఈ మార్ట్ ఏర్పాటైంది.
సాక్షి, కడప: ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలి ద్వారా రూ.150 పెట్టుబడితో.. సుమారు రూ.12 లక్షల వ్యయంతో మహిళా మార్ట్ రూపుదిద్దుకుంది. బయట మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరలకే సరుకులను అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందులో కొంత మంది డ్వాక్రా సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు సభ్యులందరికీ అదనంగా 2 శాతం రాయితీతో సరుకులను అందిస్తుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన మహిళలందరికీ ఏడాదికి ఒకసారి బోనస్ రూపంలో సొమ్ము అందించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళిక రూపొందించింది. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా పాత బస్టాండు సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఈ మార్ట్‌ను ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా విజయవంతంగా నడుపుతున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందజేయడం ద్వారా పేదలకు అనుకూలంగా ఉంటుందన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు తోడు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషితో ఈ మార్ట్ రూపుదిద్దుకుంది.
ఏది కావాలన్నా హోల్ సేల్ ధరకే
ప్రజల నిత్యావసరాలకు సంబంధించి ఏది కావాలన్న జగనన్న మహిళా మార్ట్‌లో లభిస్తుంది. డ్వాక్రా ఉత్పత్తులు, తిను బండారాలు (డ్వాక్రా మహిళలు తయారు చేసిన), ఒడియాలు, అప్పడాలు, డోర్ కర్టన్స్, నైటీలు, డోర్ మ్యాట్లు, చీపుర్లు అందుబాటులో ఉంచారు. పప్పుల దగ్గర నుంచి బెల్లం వరకు.. ఆవాల నుంచి అల్లం వరకు.. ప్రతి నిత్యావసర వస్తువు ఈ మార్ట్‌లో లభిస్తోంది. బయట మార్కెట్ కంటే ఇక్కడ ధర తక్కువ. హోల్‌సేల్ ధరకే సరుకులను అందించడంతో తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ప్రతినిత్యం డ్వాక్రా గ్రూపు సభ్యులతో పాటు ప్రజలు కూడా ఈ మార్ట్‌లో కొనుగోలు చేస్తుండటం నిత్యకృత్యంగా మారింది.
8 వేల మంది భాగస్వామ్యం
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 8 వేల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులతో మాట్లాడి ఒక్కొక్కరి వద్ద రూ.150 చొప్పున వసూలు చేసి, రూ.12 లక్షల పెట్టుబడి సొమ్ముతో మార్ట్‌ను నెలకొల్పారు. 2021 జనవరి 3వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, పాడా (పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత డ్వాక్రా గ్రూపులు పెరగడంతో మరో 5 వేల మంది సభ్యులు పెట్టుబడి సొమ్ము చెల్లించి భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చారు. లాభాల్లో 60 శాతాన్ని రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టిన ప్రతి మహిళకు ఏటా బోనస్ రూపంలో అందించనున్నారు.
భారీగా వ్యాపారం
ప్రస్తుతం ఈ మార్ట్‌లో వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. నెలలో ఐదారు రోజులు లక్ష రూపాయల వ్యాపారం సాగుతోంది. నెలకు సరాసరిన రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి సమస్యల్లేకుండా దినదినాభివృద్ధి చెందుతోంది.
డ్వాక్రా సభ్యులకు రాయితీ కార్డులు
పులివెందులలోని డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మార్ట్ పేరుతో గుర్తింపు కార్డులను ఇచ్చారు. జగనన్న మార్ట్‌కు వచ్చి సరుకులు కొనుగోలు చేసిన వారికి సొమ్ము మొత్తమ్మీద 2 శాతం రాయితీ ఇస్తున్నారు. ఉదాహరణకు రూ.3 వేల సరుకులు కొనుగోలు చేస్తే.. బయటి మార్కెట్‌తో పోలిస్తే అందరికీ 20 శాతం చొప్పున రూ.600 ఆదా అవుతోంది. దీనికి తోడు డ్వాక్రా మహిళలకు 2 శాతం అంటే రూ.60 అదనంగా మిగులుతోంది. మార్ట్‌లో ఏడుగురు డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశం కల్పించారు. సరుకుల గ్రేడింగ్ మొదలు.. ప్యాకింగ్, బిల్లు కౌంటర్ వరకు డ్వాక్రా మహిళలే అన్ని పనులు చూస్తున్నారు.
సరుకులు బాగున్నాయి
జగనన్న మహిళా మార్ట్ అందరికీ అందుబాటులో ఉంది. ప్రధానంగా సరుకుల నాణ్యత చాలా బాగుంది. ఈ మార్ట్‌ను మహిళలే నిర్వహిస్తున్నారు కాబట్టి సరుకులు, వస్తువులను ఓపికగా అందిస్తున్నారు. ఏదీ కావాలన్న మార్ట్‌లో లభిస్తోంది.
– ప్రియాంక (శ్రీసాయినగర్), పులివెందుల
ఉపాధి లభించింది
జగనన్న మహిళా మార్ట్ ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడే పని చేస్తున్నా. సరుకుల గ్రేడింగ్ మొదలుకుని ప్యాకింగ్ వరకు అన్నీ చూసుకుంటాం. మెప్మా నుంచి ప్రతినెలా రూ.7,500 ఇస్తున్నారు. నాతోపాటు మరో ఆరుగురు ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. నిత్యం సరుకుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తున్నారు.
– పుష్పలత, డ్వాక్రా గ్రూపు సభ్యురాలు, పులివెందుల
తూకం, నాణ్యతలో కచ్చితత్వం
జగనన్న మహిళా మార్ట్‌లో సరుకుల ధరలు తక్కువగా ఉన్నాయి. బయట మార్కెట్లతో పోలిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటోంది. తూకం, నాణ్యతలోనూ కచ్చితత్వం ఉంటోంది. మార్ట్ ప్రారంభించినప్పటి నుంచి మేము ఇక్కడే సరుకులు కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు కూడా రూ.3 వేలతో సరుకులను కొనుగోలు చేశాం.
– బోనాల కళావతి, పులివెందుల
సరసమైన ధరలకే సరుకులు
ఈ ఏడాది జనవరిలో జగనన్న మహిళా మార్ట్‌ను స్థాపించాం. డ్వాక్రా మహిళలకు కార్డులిచ్చి రాయితీపై సరుకులు అందిస్తున్నాం. ఇతర ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు, సరుకులు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి భాగస్వామ్యంతోనే ఈ మార్ట్‌ను ముందుకు నడిపిస్తున్నాం. ఏడాదికొకసారి పెట్టుబడి పెట్టిన ప్రతి డ్వాక్రా మహిళకు బోనస్ రూపంలో ఆదాయం పెంచుతాం.
– పి.అబ్బాస్ ఆలీఖాన్,సిటీ మిషన్ మేనేజర్, మెప్మా, పులివెందుల
Comments
Please login to add a commentAdd a comment