ఇంద్రకీలాద్రిపై కురుస్తున్న వర్షం
సాక్షి, అమరావతి: పాలకుడు మంచివాడైతే దైవం కరుణిస్తుందని, ప్రకృతి పులకిస్తుందని ఇంద్రకీలాద్రి సాక్షిగా మరోసారి రుజువైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నప్పుడు అహ్లాదకర దృశ్యం ఆవిష్కృతమైంది. అంతవరకు మండే ఎండతో, ఉక్కపోతతో ఉన్న వాతావరణంతో అందరూ చమటలతో నిట్టూర్పులు విడవసాగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా చిరుజల్లులు మొదలయ్యాయి.
సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న సీఎం ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని తన వాహనం నుంచి దిగగానే ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలై ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. సీఎం ఆలయం లోపలికి వెళ్లి పూజలు ముగించుకుని తిరిగి బయటకు వచ్చే వరకు అంటే 3.45 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ వాహనం ఇంద్రకీలాద్రి కిందకు దిగిన కాసేపటికి వర్షం ఆగిపోయింది. ఇంద్రకీలాద్రిపై తప్ప విజయవాడలో మరెక్కడా ఆ సమయంలో వర్షం పడకపోవడం విశేషం. ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి ఇది శుభ సంకేతమని అర్చకులు, పండితులు, పలువురు భక్తులు వ్యాఖ్యానించారు.
అభివృద్ధి పనులకు వెన్నుదన్ను
► ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.70 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేసిన విషయాన్ని భక్తులు గుర్తు చేసుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా ప్రభుత్వ నిధులను అమ్మవారి ఆలయానికి మంజూరు చేయలేదు.
► కృష్ణా పుష్కరాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను కూల్చివేసిన విషయాన్ని కూడా భక్తులు ప్రస్తావించారు. అందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి హిందూ ఆలయాల అభివృద్ధికి కృషిచేయడం హైందవ ధర్మం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు.
► ఇంద్రకీలాద్రిపై అన్నదాన కాంప్లెక్స్, ప్రసాదాల పోటు, కేశ ఖండనశాల నిర్మాణంతోపాటు ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు జారి పడకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు సీఎం మంజూరు చేసిన నిధులతో పనులు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment