కాంట్రాక్టు ఉద్యోగులను కనికరించని చంద్రబాబు.. బాబును నిలేయని రామోజీ
ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా వంచన మయం.. కుట్రపూరితం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పైనా మాట తప్పిన అబద్ధాల కోరు చంద్రబాబు. ఈ నిజం రాయడానికి రామోజీకి మనసొప్పదు. మంచి చేయాలనే మనసుంటే మార్గముంటుందని జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నిరూపించుకుంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే పుణ్యం కట్టుకుంది.
సుప్రీంకోర్టు తీర్పు సాకును వెతుక్కుని కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు వంచిస్తే... పదివేల మంది నెత్తిన క్రమబద్ధీకరణ పాలు పోస్తున్న నేత సీఎం జగన్. తన శిషు్యడు బాబు చేసిన మోసం రాష్ట్రం మొత్తం తెలిసినా, రామోజీ ఒక్కరే తెలియనట్లు నటిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి జరిగిపోతే ఆ ఖ్యాతి జగన్ ప్రభుత్వానికి దక్కడం రామోజీకి సుతరామూ ఇష్టం లేదు.
ఈ దుగ్ధతోనే తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై అక్షర విషాన్ని విరజిమ్ముతూనే ఉన్నారు.. ఈ అక్షర మాయావి ఎంతగా బాబును మోయాలనుకున్నా బాబు చేసిన పాపాలు జనానికి ఐదేళ్ల కిందటే తేటతెల్లమయ్యాయి... టీడీపీని శంకరగిరి మాన్యాలు పట్టించాయి.. ఇదంతా తెలిసినా తన తప్పుడు రాతలతో రోజురోజుకూ రామోజీ దిగజారిపోతూనే ఉన్నారు..
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించకుండా మోసం చేసింది మీ చంద్రబాబు నాయుడేనని తెలుసుకోవాలి రామోజీ..గత చరిత్రను వదిలేసి ఇప్పుడు ఈనాడు కళ్లు మూసుకుని ఇష్టానుసారం రాతలు రాస్తే చెల్లదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరిట కాలక్షేపానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డొస్తోందని, అందువల్ల సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబు నాయుడే.
ఇవేమీ ఈనాడు రామోజీకి అప్పట్లో కనిపించలేదు. దీనికి భిన్నంగా వైఎస్.జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే ఈనాడు రామోజీ తప్పుపట్టడాన్ని ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈనాడు చెత్తరాతలంటూ వారు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో అర్హులను తగ్గిస్తున్నారంటూ మరో అవాస్తవ ప్రచారానికి రామోజీ దిగజారారు. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు వంటివి పాటిసూ్తనే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించకపోవడానికి ఇదేమీ రామోజీ సొంత జాగీరు కాదు. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది.
వాస్తవానికి ఐదేళ్లు నిద్రపోయి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పింది మీ చంద్రబాబు నాయుడే రామోజీ. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు వైఎస్.జగన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందేమీ కాదు. టీడీపీ ఆవిర్భవించక ముందు నుంచే కాకుండా, బాబు ప్రభుత్వంలోనూ ఉంది. అయినా చంద్రబాబుకు చేతకాని పనిని జగన్ ప్రభుత్వం చేసి చూపించి, కాంట్రాక్టు ఉద్యోగుల నెత్తిన పాలు పోసింది. అందుకే బాబును నమ్మం గాక నమ్మం ... అని 2019లో టీడీపీని చిత్తుగా ఓడించి, ఉద్యోగులు ఇంటి బాట పట్టించారు.
సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక శాఖ చర్యలను చేపట్టింది. ఎన్నికల కోడ్ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. తదనుగుణంగా మార్గదర్శకాలను 13–12–2023న సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. క్రమబద్ధీకరణ కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్‌లో ఉద్యోగులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలి్సందిగా స్పష్టం చేసింది.
అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జగన్ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3000 మందిని క్రమబద్ధీకరించారు. మిగతా వారికి అవకాశవిుచ్చే క్రమంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మాట ఇస్తే మడమ తిప్పరనే నమ్మకం ఉన్నందునే మళ్లీ జగన్‌ను సీఎంను చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
బాబు సర్కారుకు – జగన్ సర్కారుకు తేడా..
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక, మానవ వనరులు, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09–09–2014న జీవో 3080 ద్వారా ఒక బృందాన్ని బాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ ఐదేళ్ల పాలనలో మంత్రుల బృందం సమావేశాలతో సాగదీయడమే కాకుండా చివరగా సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపించి, క్రమబద్ధీకరణ సాధ్యం కాదంటూ చేతులెత్తేసి, ఇచ్చిన మాటను తప్పింది.
ఇప్పుడు జగన్ సర్కారు
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం’ అని జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఈ మేరకు అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ, వర్కింగ్ కమిటీలు పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించాయి. క్రమబద్ధీకరణపై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని ఈ కమిటీలు సూచించాయి.
క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను జగన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే గత చంద్రబాబు సర్కారుకు – ఇప్పటి వైఎస్ జగన్ సర్కారుకు తేడా.
Comments
Please login to add a commentAdd a comment