లబ్బీపేట (విజయవాడ తూర్పు): వోకల్ కార్డు (స్వరతంత్రి) కుడి వైపు పెరాలసిస్(పక్షవాతం)కు గురై సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగికి ఈఎన్‌టీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి మరలా మాట్లాడేలా చేయగలిగారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించిన ఈ శస్త్ర చికిత్స గురించి ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి శుక్రవారం మీడియాకు వివరించారు.
ఒంగోలుకు చెందిన డ్రైవర్ అప్పయ్య స్వర సమస్యతో చికిత్స కోసం తమ విభాగానికి రాగా, అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి వోకల్‌కార్డు కుడివైపు పెరాలసిస్ వచ్చినట్లు నిర్ధారించామని చెప్పారు. ఈ నెల 17న వీడియో ఎండోస్కోపీ ద్వారా స్వరాన్ని విశ్లేషిస్తూ థైరోప్లాస్టీ–1 అనే అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి మామూలుగా మాట్లాడగలుగుతున్నారని చెప్పారు.
ఈ శస్త్ర చికిత్సలో ఈఎన్‌టీ వైద్యులు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు రత్నబాబు, శ్రీనివాస్, ఆదిత్య, స్పందన, వర్థిని, పీటర్‌లతో పాటు పీజీ విద్యార్థులు, స్పీచ్ థెరపిస్ట్ జి గాయత్రి, మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ లవకుమార్ పాల్గొన్నారు. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment