ఎస్పీని కోరిన రషీద్ తల్లిదండ్రులు
నిందితులను కాపాడే యత్నం: బొల్లా
నరసరావుపేట: తమ కుమారుడి హత్యలో ప్రమేయం ఉన్న వారి పేర్లు చెప్పినా ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదని వినుకొండలో హత్యకు గురైన రషీద్ తల్లి బడేబీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు రషీద్ తల్లిదండ్రులు పరేషా, బడేబీలు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిడ్డను కోల్పోయి తామంతా పుట్టెడు దుఃఖంలో ఉంటే.. తన కుటుంబంపై పరువునష్టం దావా వేస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఇలా వేధించడం కంటే ఒక్కసారిగా ‘మమ్మల్ని కూడా నరికించండి’.. అంటూ విలపించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ‘ఇప్పుడు కొమ్మలే నరికాం.. భవిష్యత్తులో మొదలు నరుకుతాం.. ’ అని ప్రకటిస్తున్నారంటే తనను కూడా తుదముట్టించాలనే ఆలోచన వారికి ఉందని.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉండి తీరతానని స్పష్టం చేశారు.
రషీద్ హత్యకు ప్రేరేపించిన వారిని పక్కన పెట్టి ఎవరెవరినో అరెస్ట్ చేశారని విమర్శించారు. అసలైన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. రషీద్ రౌడీషీటర్ అని ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అతడు సౌమ్యుడని, గొడవలకు వెళ్లే వ్యక్తి కాదన్నారు. తన స్వగ్రామం వేల్పూరులో 30 మంది పోలీసులను పెట్టినా.. టీడీపీకి ఓటేయలేదన్న కారణంతో టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని బొల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment