తరచూ తొక్కిసలాటలకు కారణమిదే
నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు తీరిదే
సాక్షి, అమరావతి: తన పరిపాలన గురించి గొప్పగా అతిశయోక్తులు చెప్పుకునే చంద్రబాబు.. వాస్తవంలో మాత్రం చేతులెత్తేసి చోద్యం చూడడం మినహా ఏమీ చేయలేరని మరోసారి స్పష్టమైంది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడటం, పలువురు క్షతగాత్రులవ్వడమే ఇందుకు నిదర్శనం. పాలనా వైఫల్యానికి, అసమర్థతకు ఇదో మచ్చుతునక. ఇదొక్కటే కాదు చంద్రబాబు హయాంలో అడుగడుగునా వ్యవస్థల వైఫల్యం కనిపిస్తుంది.
ఇటీవలే బుడమేరు వరద నిర్వహణలో విఫలమై విజయవాడను ముంచేసి, లక్షలాది కుటుంబాలను రోడ్డుపాలు చేశారు. అంతకు ముందు 2015లో గోదావరి పుష్కరాల్లో తన ప్రచార పిచ్చితో తొక్కిసలాటకు కారణమై 29 మంది నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలోనూ కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రజల ప్రాణాలను హరించారు. విజయవాడలో జరిగిన కృష్ణా నది బోటు ప్రమాదంలో 21 మంది మృత్యువాత పడటానికి కారకుడయ్యారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నిర్వహణా లోపాలు మలుపు మలుపులో కనిపిస్తాయి. ఈ లోపాల ఖరీదు పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడం. పాలనా పరమైన సమర్థత లోపించడం వల్లే ఆయన హయాంలో తరచూ ప్రమాదాలు, తొక్కిస లాటలు జరుగుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం ప్రణాళిక ఉన్నా, నిర్వహణా సామర్థ్యం ఉన్నా.. ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు.
వేలాది, లక్షలాది మంది వస్తారనే ముందస్తు సమాచారం ఉన్నా.. తరచూ జరిగే కార్యక్రమాలే అయినా తొక్కిసలాటలు జరగడానికి కారణం వ్యవస్థలు నీరుగారి పోవడమేనని చెబుతున్నారు. వైంకుఠ ద్వార దర్శనం 10 రోజులు ఉండగా, తొలి మూడు రోజులకు ఒకేసారి టికెట్లు ఇవ్వాలనుకోవడంలోనే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.
అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తుండడంతో వారు తమ అసలైన కర్తవ్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. తిరుమల యంత్రాంగాన్ని తన రాజకీయ ప్రాపకం కోసం వాడుకుని, అసలు పని చేయలేని పరిస్థితి కల్పించడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని చెబుతున్నారు.
నాడు ప్రచార పిచ్చితో 29 మంది బలి
చంద్రబాబు ప్రచార పిచ్చి, నిర్వహణా సామర్థ్యం లోపం వల్ల 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ఘటనలో పుష్కర స్నానాల కోసం వచ్చిన 29 మంది మృత్యువాత పడ్డారు. పుష్కర ఘాట్‌లో కుటుంబంతో కలిసి స్నానానికి వచ్చిన చంద్రబాబు కోసం వేలాది మంది భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలిపివేశారు.
తర్వాత ఒక్కసారిగా అందరినీ వదలడంతో తొక్కిసలాట జరిగింది. తన కుటుంబం పుష్కర స్నానం చేసే దృశ్యాలను ఒక అంతర్జాతీయ టెలివిజన్ చానల్ కోసం వీడియో షూట్ చేయించుకుంటూ వేలాది మంది భక్తులను క్యూలైన్లలో కుక్కిపడేశారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ మృత్యుఘోషగా మారింది.
కృష్ణా నదిలో బోటు బోల్తా.. 21 మంది మృతి
2017 నవంబర్ 13న విజయవాడ–ఇబ్రహీంపట్నం మధ్య కృష్ణా నదిలో బోటు మునిగిపోయి 21 మంది మృతి చెందారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా కృష్ణా నదిలో బోట్ల విహారానికి అనుమతిచ్చింది. నదీ ప్రవాహం, ఒరవడి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా కేవలం టూరిజం పేరుతో జరిగే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ బోటు ప్రమాదానికి కారణమయ్యారు.
డ్రోన్ షో కోసం ఎనిమిది నిండు ప్రాణాలు బలి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన స్వార్థం కోసం ఇరుకురోడ్డులో రోడ్‌షోలు నిర్వహించి జనాన్ని బలి తీసుకున్నారు. 2022 డిసెంబర్ 29న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్‌షో నిర్వహించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో డ్రెయిన్‌లో పడిపోయి ఎనిమిది మంది చనిపోయారు.
జనం ఎక్కువగా వచ్చినట్టు చూపించుకునేందుకు ప్రధాన కూడలిలో కాకుండా ఇరుకు రోడ్డులోకి తన వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ డ్రోన్ విజువల్స్ తీస్తుండగా ఈ దారుణం జరిగింది. కేవలం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు సైతం తేల్చారు.
కానుకల పంపిణీ పేరుతో..
గత ఏడాది జనవరి 1న గుంటూరు జేకేసీ కాలేజీలో స్థానిక టీడీపీ నాయకుడు ఉయ్యూరు శ్రీనివాస్ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. చంద్రబాబు చేతుల మీదుగా కానుకలు పంపిణీ చేస్తారని విపరీతంగా ప్రచారం చేసి భారీగా జనాన్ని తీసుకువచ్చారు.
కానీ చంద్రబాబు పది మందికి కానుకలు ఇచ్చి వెళ్లిపోగా, ఆ తర్వాత వాటి కోసం జనం ఎగబడడంతో తోపులాట జరిగి ముగ్గురు చనిపోయారు. కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా జనాన్ని రప్పించి వారి ప్రణాలు పోవడానికి కారకుడిగా మిగిలారు.
Comments
Please login to add a commentAdd a comment