
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఎర్ర చందనం దుంగల వేలం ప్రక్రియ విజయవంతమైంది. అమ్మకానికి పెట్టిన దుంగల్లో 95 శాతం అమ్ముడుపోయాయి. ఏపీఎఫ్‌డీసీ (ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) గ్లోబల్ టెండర్లు పిలిచి ఈ నెల 9న ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించింది. ఎర్ర చందనానికి ప్రధాన మార్కెట్ అయిన చైనా వ్యాపారులకు తెలిసేలా అంతర్జాతీయ మేగజైన్లలో ప్రకటనలు ఇచ్చింది. దీంతో వారితోపాటు ఇతర దేశాలకు చెందిన పలువురు వ్యాపారులు వేలంలో పాల్గొని అమ్మకానికి పెట్టిన 318 టన్నుల్లో 302 టన్నుల్ని కొనుగోలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. టన్ను ఎంత ధరకు విక్రయించారనే విషయాన్ని అధికారవర్గాలు ఇంకా బయటపెట్టలేదు. గతం కంటే మంచి ధర వచ్చినట్లు చెబుతున్నారు.
ఎంఎస్‌టీసీ ద్వారా పారదర్శకంగా వేలం
ఎర్రచందనం అమ్మకం, ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పదేళ్ల క్రితం 8,498 టన్నుల అమ్మకానికి కేంద్రం అనుమతి ఇవ్వగా అందులో 8,180 టన్నుల దుంగల్ని 13 విడతల్లో విక్రయించారు. ఆ కోటాలో మిగిలిన 318 టన్నుల దుంగల్ని అమ్మేందుకు గడువు ముగియడంతో ఇటీవలే దాన్ని కేంద్రం ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పొడిగించింది. దీంతో ఈలోపే అమ్మకాలు జరిపి ఎగుమతులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) ద్వారా పారదర్శకంగా వేలం నిర్వహించారు. మార్కెట్ బాగుండడంతో వేలానికి మంచి స్పందన లభించింది. మిగిలిన 16 టన్నుల అమ్మకానికి 16వ తేదీన రెండో విడత ఆన్‌లైన్ వేలం నిర్వహించనున్నారు. వేలం వేసిన సరుకు కాకుండా అటవీ శాఖ దగ్గర ఇంకా 5 వేల టన్నుల ఎర్ర చందనం నిల్వలున్నాయి. ఇటీవలి కాలంలో అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకోవడంతో నిల్వలు పెరిగాయి. వీటిని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సాధించే ప్రక్రియను అటవీ శాఖ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ దుంగల్ని అమ్మితే సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment