సంస్కార హీనులంటూ నోరుజారిన మంత్రి సుభాష్.. గొడవపడ్డ ఇరుపక్షాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్తీక వన సమారాధనలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాకినాడలో ఆదివారం జరిగిన ఒక సామాజికవర్గ వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాజకీయాలు ప్రస్తావించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తే.. కుల సంఘ నాయకులు దూరంగా ఉండాలని, ఎవరు నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవాలని చెప్పాలే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాయకూడదని, ఎవరో సిద్ధం అంటే వారికి మద్దతు తెలపడం తగదని మంత్రి సుభాష్ అన్నారు.
దీంతో వనసమారాధనలో గలాటా మొదలైంది. కుల సంఘ నాయకులను తప్పు పడుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నిరసన తెలిపారు. దీంతో మంత్రి నోరు జారి సంస్కార హీనులను దూరంగా ఉంచాలని, సంస్కారం లేని వెధవలను పట్టించుకోవద్దని అనడంతో ఒక్కసారిగా తోపులాట మొదలైంది. మంత్రి మాటలతో ఆగ్రహించిన కొందరు కుర్చిలు సైతం విసిరారు. అక్కడున్న వారు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం ఒకరినొకరు నెట్టుకున్నారు. బాహాబాహీకి దిగారు.
పోలీసులు రంగప్రవేశం వేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రామచంద్రపురం కో–ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తన సామాజికవర్గానికి తాను అండగా ఉంటానన్నారు. శెట్టిబలిజ సామాజికవర్గం నేడు కలుసుకుంటుందంటే దానికి కారణం దొమ్మేటి వెంకటరెడ్డి అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment