vanasamaradhana
-
కార్తీక వనసమారాధనలో గలాటా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్తీక వన సమారాధనలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాకినాడలో ఆదివారం జరిగిన ఒక సామాజికవర్గ వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాజకీయాలు ప్రస్తావించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తే.. కుల సంఘ నాయకులు దూరంగా ఉండాలని, ఎవరు నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవాలని చెప్పాలే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాయకూడదని, ఎవరో సిద్ధం అంటే వారికి మద్దతు తెలపడం తగదని మంత్రి సుభాష్ అన్నారు. దీంతో వనసమారాధనలో గలాటా మొదలైంది. కుల సంఘ నాయకులను తప్పు పడుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నిరసన తెలిపారు. దీంతో మంత్రి నోరు జారి సంస్కార హీనులను దూరంగా ఉంచాలని, సంస్కారం లేని వెధవలను పట్టించుకోవద్దని అనడంతో ఒక్కసారిగా తోపులాట మొదలైంది. మంత్రి మాటలతో ఆగ్రహించిన కొందరు కుర్చిలు సైతం విసిరారు. అక్కడున్న వారు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం ఒకరినొకరు నెట్టుకున్నారు. బాహాబాహీకి దిగారు.పోలీసులు రంగప్రవేశం వేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ రామచంద్రపురం కో–ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తన సామాజికవర్గానికి తాను అండగా ఉంటానన్నారు. శెట్టిబలిజ సామాజికవర్గం నేడు కలుసుకుంటుందంటే దానికి కారణం దొమ్మేటి వెంకటరెడ్డి అని చెప్పారు. -
హిరో నిఖిల్ సందడి
గన్నవరం : ప్రముఖ సినీహిరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ గన్నవరంలో సందడి చేశారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో సమీపంలోని తోటలో ఆదివారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన వనసమారాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిఖిల్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా హ్యాపీడేస్ రిలీజ్ అయ్యే వరకు తన గురించి ఎవరికి తెలియదని, మీరందరూ చూపిస్తున్న అభిమానంతో ఇప్పటి వరకు విజయవంతంగా 13 సినిమాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం రిలీజైన ఎక్కడిపోతావు చిన్నావాడా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందన్నారు. యువత తల్లిదండ్రులు చెప్పినట్లు చదువులో రాణిస్తూ మంచి ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు. తర్వాత తమ ఆసక్తికి అనుగుణంగా ఎంచుకున్న రంగాల్లో ప్రతిభను నిరూపించుకోవాలని చెప్పారు. తాను కూడా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే ఇష్టమైన సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు వివరించారు. తొలుత ఆయనకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెరుసు సతీష్, బొడ్డు రమేష్, నాయకులు నాగనబోయిన గిరిష్రాజు, దారం దుర్గావరప్రసాద్, కొలుసు పాములు స్వాగతం పలికారు.