
సాక్షి, అమరావతి: గణతంత్ర వేడుకల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమైంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్ తదితరులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 26వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే వేడుకల్లో ప్రదర్శించేందుకు గానూ 14 శకటాలను సిద్ధం చేస్తున్నారు.
వ్యవసాయ, పశుసంవర్థక, ఆరోగ్యశ్రీ, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, కోవిడ్, గ్రామ–వార్డు సచివాలయాలు, పాఠశాల విద్య, స్త్రీ–శిశు సంక్షేమం, గ్రామీణ పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణం, సర్వే అండ్ సెటిల్‌మెంట్, పరిశ్రమలు, అటవీ, పర్యాటక–సామాజిక శాఖల శకటాలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో చేసే కవాతు(పెరేడ్) కోసం రెండు రోజులుగా పోలీస్ ప్రత్యేక బృందాలు రిహార్సల్స్ చేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్‌పీ 2వ బెటాలియన్ (కర్నూలు), 3వ బెటాలియన్ (కాకినాడ), 9వ బెటాలియన్ (వెంకటగిరి), 14వ బెటాలియన్ (అనంతపురం), 16వ బెటాలియన్ (విశాఖ)లు గణతంత్ర వేడుకల్లో కవాతు చేయనున్నాయి. వీటితోపాటు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లు, హైదరాబాద్ స్పెషల్ పోలీస్, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ పైప్ బ్యాండ్‌ను ప్రదర్శించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment