విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రసంగిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్
సాక్షి, అమరావతి: రైతుల శ్రేయస్సు, విద్యారంగ సంస్కరణలు, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ నవరత్నాల పథకాలతో సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకెళుతోందని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తెలిపారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా దక్కాలన్న రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ, అభివృద్ధి అజెండాను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని చెప్పారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం, ఉద్యోగుల హక్కుల్లో సమతుల్యతను పాటిస్తూ కోవిడ్ ఆర్థిక ఇబ్బందుల్లోనూ మెరుగైన పీఆర్సీ ప్రకటించామని గవర్నర్ స్పష్టం చేశారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉగాది నాటికి రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని తెలిపారు. గత 32 నెలల్లో రికార్డు స్థాయిలో నేరుగా నగదు బదిలీ, నగదేతర పథకాల ద్వారా 9,29,15,170 మంది లబ్ధిదారులకు రూ.1,67,798 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని వెల్లడించారు. 6,80,62,804 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,27,173 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేశామన్నారు. 2,48,52,366 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ తోడ్పాటుతో రూ.40,625 కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ వివరాలివీ..
జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న గవర్నర్
ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం
ఉద్యోగులు మా ప్రభుత్వంలో అంతర్భాగం. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ చర్యలు చేపట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నడూ లేని విధంగా 27% ఐఆర్ మంజూరు చేసింది. దీనివల్ల రూ.17,265 కోట్ల ఆర్థిక భారం పడింది. రెవెన్యూ లోటు, కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు తలెత్తినా 11వ వేతన సవరణను 23 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయడంతో రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతోంది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాం.
రైతుల శ్రేయస్సే లక్ష్యం..
10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు గ్రామాల్లోనే అందిస్తున్నాం. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 22.78 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేశాం. లాక్‌డౌన్‌లోనూ రైతుల నుంచి రూ.35,396 కోట్ల విలువైన 1.91 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. రూ.6,499 కోట్ల విలువైన ఇతర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు రైతులకు రూ.86,313 కోట్ల సాయం అందించాం. వైఎస్సార్ రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.19,126 కోట్లు పంపిణీ చేశాం. పంటలు నష్టపోయిన రైతులపై ఒక్కపైసా భారం పడకుండా 31.07 లక్షల మందికి రూ.3,788 కోట్ల మేర పంటల బీమాను ప్రభుత్వం చెల్లించింది. పెట్టుబడి రాయితీ కింద 13.96 లక్షల మందికి రూ.1,071 కోట్లు చెల్లించాం. రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం.
► సహకార డెయిరీ వ్యవస్థను పునరుద్ధరించి బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. 9,899 గ్రామాలను గుర్తించి మహిళా డెయిరీ సహకార సంఘాలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాం.
► వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 1,19,875 మత్స్యకార కుటుంబాలకు రూ.332 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాం. నరసాపురంలో మత్స్య యూనివర్సిటీ, 27 చోట్ల ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం.
► రూ.3,177 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. రూ.558 కోట్లతో 70 ఆక్వా హబ్‌లు, 14,000 స్పోక్స్ ఆఫ్ రిటైల్ అవుట్‌లెట్స్ నెలకొల్పనున్నాం.
విద్యా విప్లవం..
వివిధ విద్యా పథకాల ద్వారా 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మనబడి నాడు–నేడు ద్వారా దాదాపు 56,703 ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, జూనియర్ కళాశాలను దశల వారీగా రూ.16,025 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చాం.
► జగనన్న విద్యా కానుక కింద 50,53,844 మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏటా రూ.731.30 కోట్లు ఖర్చు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మందికి రూ.13,023 కోట్లు అందచేసింది. జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్) కింద 21,55,298 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,260 కోట్లు జమ చేసింది. జగనన్న వసతి దీవెన కింద 18,77,863 మంది లబ్ధిదారులకు రూ.2,305 కోట్లు అందజేసింది.
ఆరోగ్యానికి భరోసా..
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా అదనంగా 172 పీహెచ్‌లను నిర్మిస్తున్నాం. రూ.7,880 కోట్లతో 16 కొత్త అదనపు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వైద్య రంగంపై రూ.16,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడేళ్లలో జిల్లా కేంద్రాల్లో 16 హెల్త్ హబ్‌లు ఏర్పాటవుతాయి. 40,000 మంది వైద్య సిబ్బంది నియామకాలు కూడా చేపట్టాం.
► డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2,446 ప్రొసీజర్లకు సంబంధించి వైద్య సేవలను అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా కింద 6,77,559 మందికి రూ.445 కోట్ల మేర సాయం చేశాం. 104 వాహన వైద్య సేవలను మండలానికి ఒకటి చొప్పున విస్తరించి 20 రకాల సేవలను అందిస్తున్నాం. రూ.561 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు కూడా అందిస్తున్నాం.
కోవిడ్‌పై సమష్టి యుద్ధం..
కోవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోంది. 629 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53,533 బెడ్లను అందుబాటులో ఉంచాం. ఇప్పుడు 35 దఫా పీవర్ సర్వే ఇంటింటికీ జరుగుతోంది. ఆస్పత్రుల్లో 176 పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసి 24,419 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. 81 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశాం.
► జనవరి 21 నాటికి వంద శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. 86 శాతం మంది ప్రజలకు రెండు డోసులు ఇచ్చాం. 15–18 ఏళ్ల వారికి 93 శాతం ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైంది.
మహిళా సాధికారత...
మహిళల సమగ్ర అభివృద్ధి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది. 98 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ కింద రూ.2,354 కోట్లు చెల్లించాం. రూ.25,517 కోట్ల పొదుపు సంఘాల బకాయిలను ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12,758 కోట్లు తీర్చింది. వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,500 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. రెండేళ్లలో 25 లక్షల మందికి రూ.9,308 కోట్లు జమ చేసింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద 45–60 ఏళ్ల కాపు, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల మహిళలకు ఏడాదికి రూ.15,000 చొప్పున 3,27,349 మంది లబ్ధిదారులకు రూ.982 కోట్లు అందచేసింది. కొత్తగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణ పేద మహిళలు 3.92 లక్షల మందికి రూ.589 కోట్లు అందచేశాం. 50 శాతం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మహిళల రక్షణకు దిశ బిల్లు తీసుకొచ్చాం.
వైఎస్సార్ పింఛన్‌కానుక
ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం రూ.2,500కి పెంచింది. ప్రతి నెలా 62 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,570 కోట్లు అందచేస్తోంది. ఇప్పటి వరకు రూ.45,837 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ చేసింది.
► చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కింద ఏటా రూ.24 వేలు అందిస్తున్నాం. ఐదేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.20 లక్షల మేర ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందజేశాం.
► వైఎస్సార్ బీమా కింద ఏటా రూ.510 కోట్ల బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు 1,03,171 బాధిత కుటుంబాలకు రూ.1,682 కోట్లు బీమా పరిహారంగా అందించాం.
► వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2,74,105 మంది లబ్ధిదారులకు రూ.771 కోట్లు ఆర్థిక సాయం చేశాం.
పారిశ్రామీకరణకు పెద్దపీట
సులభతర వాణిజ్యంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్‌ఎంఈలకు రూ.2,029 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. కడప జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.25వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 75 వేల ఉద్యోగాలు కల్పించనున్నాం. దీనికి అనుబంధంగా 801 ఎకరాల్లో రూ.730 కోట్లతో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి చేశాం. తద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 25 వేల ఉద్యోగాలు కల్పించనున్నాం. రూ.13 వేల కోట్లతో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. భోగాపురం, దగదర్తిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తాం.
పేదల సొంతింటి కల సాకారం...
ప్రభుత్వం ఇప్పటి వరకు 32 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నాం. 17 వేల వైఎస్సార్ జగన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లు ఖర్చు చేశాం.
► మధ్య తరగతి కుటుంబాలకు జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకం కింద నివాస స్థలాలను లాభాపేక్ష లేకుండా అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం స్థలాలను 20 శాతం రాయితీతో కేటాయిస్తున్నాం. పెన్షనర్లకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాం.
జలయజ్ఞం..
2023 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఆర్ అండ్ ఆర్ కింద నిర్వాసితులకు సత్వర న్యాయం చేస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తయింది. నల్లమల సాగర్ రిజర్వాయర్ పూర్తి చేశాం. 2022 ఖరీఫ్ నాటికి ప్రకాశం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందిస్తాం. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీలను మార్చిలోగా ప్రారంభిస్తాం. వంశధార ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలకు నీటి వసతిని మెరుగుపరుస్తాం. అవుకు టన్నెల్‌ను ఈఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రూ.15,448 కోట్లతో చేపట్టాం. కరువు నివారణతోపాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేలా 54 కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
సచివాలయాల శకటానికి ఫస్ట్ ప్రైజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏపీ స్పెషల్ బెటాలియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ శంఖభ్రాత బాగ్చీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు పరేడ్‌కు విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ ఎస్ సతీష్‌కుమార్ నేతృత్వం వహించారు.
కవాతు ప్రదర్శనలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ (విజయనగరం) ప్రథమ బహుమతి సాధించింది. 3వ బెటాలియన్ (కాకినాడ) ద్వితీయ బహుమతి పొందగా, కర్నాటక ఉమెన్ ఆర్మ్‌డ్ పోలీస్‌లకు స్పైషల్ ప్రైజులు, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శకటాలకు సంబంధించి బహుమతులను అందజేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్
నవ రత్నాలతో శకటాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన 16 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవరత్నాల వెలుగులను నలుదిశలా ప్రసరిస్తున్న వైనాన్ని వివరిస్తూ శకటాలు ముందుకు సాగాయి. గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూపొందించిన శకటం ప్రథమ బహుమతి సాధించింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటం ద్వితీయ బహుమతి, వైద్య, ఆరోగ్యశాఖ శకటం తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి.
కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా మాత్రమే అతిథులను ఆహ్వానించినందున శకటాలను ప్రజలంతా తిలకించేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ సూచనల మేరకు విజయవాడ వీధుల్లో ప్రదర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శకటాలను జెండా ఊపి ప్రారంభించారు. బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, కంట్రోల్ రూమ్ మీదుగా ప్రయాణించి శకటాలు తిరిగి స్టేడియం వద్దకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment