
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: పరిపాలనలో తలెత్తే అంశాలను లిటిగేషన్ల ద్వారా అడ్డుకోవాలని చూడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ మేధావులు, పౌరుల సమాఖ్య(ఏపీఐసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు పి.విజయబాబు విమర్శించారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల తీర్పునకు వక్రభాష్యం చెప్పడం, కోర్టుల వ్యాఖ్యానాలను తమ అనుకూల మీడియా ద్వారా మసిపూసి మారేడుకాయ చేసి చూపడం ఇటీవలికాలంలో తెలుగుదేశం లాంటి పార్టీలకు పరిపాటి అయిందని తప్పుపట్టారు. సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పాత్ర – న్యాయపరమైన సమస్యలు’ అనే అంశంపై ఏపీఐసీ ఆధ్వర్యంలో మంగళవారం వర్చువల్ సమావేశం జరిగింది.
ఇందులో పలువురు విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాదులు, మేధావులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత చంద్రబాబుతోపాటు కొన్ని పత్రికలు, చానల్స్ పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. జగన్ తల నరుకుతా వంటి చర్చలు పెట్టి హెడ్డింగ్స్ హైలెట్ చేస్తూ, ఇదే జర్నలిజమని తొడలు చరుచుకుంటూ, ఇది రాజద్రోహం కాదంటూ.. చట్టాల్లో ఉన్న లూప్‌హోల్స్‌ను అవకాశంగా తీసుకుని తప్పించుకోజూస్తున్న సోకాల్డ్ మీడియా సంస్థలు, వాటిని మోస్తున్న బోయీలు ఇప్పటికైనా తీరుమార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఒకట్రెండు మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నాయని ఫార్మా కాలేజ్ ఆచార్యులు డాక్టర్ అవనాపు శ్రీనివాసరావు విమర్శించారు.
రాష్ట్రంలో వినూత్నమైన పాలన...
నేను విన్నాను–నేను ఉన్నాను అని పాదయాత్రలో చెప్పినట్లే.. అధికారంలోకి వచ్చాక దాన్ని తూచా తప్పక చేసి చూపించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు డి.బాలాజీరెడ్డి ప్రశంసించారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్‌కు అడుగడుగునా న్యాయస్థానాల్లో అడ్డుతగలడం చూస్తుంటే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనడానికి నిదర్శనమని చెప్పారు. ఆర్‌టీఐ కార్యకర్త జి.శాంతామూర్తి మాట్లాడుతూ.. జగన్ రెండేళ్ల పాలన స్ఫూర్తిదాయకమే కాక చరిత్రాత్మకమన్నారు. దీన్ని సహించలేని ఎల్లో మీడియా అయినదానికి, కానిదానికి ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది మల్లికార్జునమూర్తి మాట్లాడుతూ న్యాయవాదులకు సంబంధించి సంక్షేమనిధికి చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, సీఎం జగన్ వచ్చాక రూ.100 కోట్లు సంక్షేమనిధికి ప్రకటించారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ టి.నాగభూషణరావు, బీబీఏ మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ పిళ్లా రవి, ప్రొఫెసర్, లా కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ముద్దా బెంజమిన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment