సాక్షి,పలమనేరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కారు పూర్తిగా ధ్వంసమైపోయింది.
సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మృతులు కర్ణాటక రాష్ట్రం వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుల వివరాలు
మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన వారి వివరాలు మోహన్ దాస్ (71),నాగరాజరావు (61),కుసుమ (61)జయంతి (59), పూజ (33)గా నిర్ధారించారు.



