సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం కింద ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా కేంద్రం నిధులు ఇస్తుంది. ఈ నిధులతో ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సిటీ సబర్బన్ సర్వీసులు పెంచుకునే అవకాశం ఉంది. సెట్విన్ తరహాలో బస్సులను ప్రవేశపెట్టడం, డిపోల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. కేంద్ర నిధులతో నిరుద్యోగ యువత సెట్విన్ తరహా బస్సులు కొనుక్కుని బస్సు ఆపరేటర్లుగా మారి సొంతంగా నడుపుకొనేందుకు అవకాశముంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 1,100 సిటీ సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది.
గుంటూరులో సిటీ సర్వీసులు తిప్పేందుకు గతంలో ప్రయత్నించినా.. ఆర్టీసీకి కిలోమీటరుకు భారీ నష్టం వస్తుందని వాటి జోలికి వెళ్లలేదు. మిగిలిన నగరాల్లోనూ సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (యూఎంటీసీ) ద్వారా అధ్యయనం చేయించనుంది. ఆర్టీసీ ఇప్పటికే కాకినాడ నగరంలో అధ్యయనం చేసింది. ఇక్కడ సిటీ సర్వీసులు పెంచేందుకు కాకినాడకు 20 కి.మీ. పరిధిలో 215 సిటీ సర్వీసులు నడిపేలా ప్రతిపాదనల్ని యూఎంటీసీకి అందించింది. మిగిలిన చోట్ల అధ్యయనం చేసి ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 20 కి.మీ. వరకు.. మొత్తం పదివేల సిటీ బస్సుల్ని తిప్పడం ఆర్టీసీ లక్ష్యంగా ఉంది.
కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణాను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం ద్వారా ఆర్టీసీలను ఆదుకోవాలని నిర్ణయించింది. దీని ప్రకారం కిలోమీటరుకు రూ.7 వంతున సబ్సిడీ రూపంలో ఆర్టీసీకి ఇవ్వనుంది. రాష్ట్రంలో భారీగా సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విజయవాడలో 650కి పైగా సిటీ సర్వీసులు తిప్పుతున్నా.. ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని, ఇక్కడ సర్వీసులు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. కేంద్ర పథకం కింద గ్రాంటుగా నిధులిస్తే తొలివిడత రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో మూడువేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.
సిటీ బస్సుల పెంపునకు ఆర్టీసీ ప్రణాళిక
Published Sat, Jan 16 2021 4:20 AM | Last Updated on Sat, Jan 16 2021 9:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment