city bus services
-
TSRTC: న్యూ ఇయర్లో షాకిచ్చిన ఆర్టీసీ.. సిటీలో ప్రయాణికులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గట్టి షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీ కోసం టీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనికి మంచి స్పందన కూడా లభించింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది. ఈ సందర్బంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023 ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’ అని తెలిపారు. -
HYD: డొక్కు బస్సులే దిక్కా?
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఊరించి ఉసూరుమనిపిస్తూనే ఉంది. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఏళ్లకు ఏళ్లుగా కాలం చెల్లిన సిటీ బస్సులే నడుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఒక్క కొత్త బస్సు కూడా రోడ్డెక్కలేదు. మరోవైపు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది. ఔటర్‌కు వెలుపల సైతం వదలాది కాలనీలు వెలిశాయి. ఆయా కాలనీలన్నీ ప్రజా రవాణాకు దూరంగానే ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడి లక్షలాది మంది నగరవాసులు రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పొరుగున ఉన్న ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా పరుగులు తీస్తుండగా హైదరాబాద్‌లో మాత్రం చతికిలపడటం గమనార్హం. ఈ– బస్సులేవీ? రెండేళ్లుగా ఎలక్ట్రిక్ బస్సులపై ఊరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సర్వీసు కూడా అందుబాటులోకి రాలేదు. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడిపేందుకు గతేడాది టెండర్ల ఆహ్వానించారు. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలో ఒక సంస్థ సాంకేతిక సామర్థ్యంపై అనర్హత కారణంగా టెండర్ల ప్రక్రియలో వివాదం చోటుచేసుకుంది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ వివాదం పరిష్కారమైనప్పటికీ ఇంకా ప్రతిష్టంభన తొలగిపోలేదు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికే నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 300 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో సుమా రు 2,850 బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం వెయ్యికిపైగా డొక్కు బస్సులే. కాలం చెల్లిన వీటితోనే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా ఈ అరకొర బస్సులతోనే ఆర్టీసీ అధికారులు పాట్లు పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలకు రోజుకు 8 ట్రిప్పుల డిమాండ్ ఉంటే కేవలం 4 ట్రిప్పులే నడుపుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 6 వేల బస్సులు అవసరం.. రవాణారంగ నిపుణుల అంచనా మేరకు విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాల మేరకు ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు కావాలి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో వేలకొద్దీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులో నిత్యం 6వేల బస్సులు నడుస్తుండగా అదనంగా మరిన్ని కొనుగోలుకు చర్యలు చేపట్టారు. ముంబైలో ఎలక్ట్రిక్ డ బుల్ డెక్కర్ బస్సులు అందుబాటు లోకి వచ్చాయి. వాహన కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో సీఎన్జీ బస్సులను భారీ ఎత్తున కొనుగోలు చేసి నడుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అందుకు విరుద్ధంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. -
Hyderabad: బస్‌పాస్ చార్జీలు భారీగా పెంపు?
సాక్షి, హైదరాబాద్: సాధారణ ప్రయాణికులే లక్ష్యంగా డీజిల్ సెస్, టిక్కెట్ ధరల రౌండాఫ్ నెపంతో ఇప్పటికే నగరంలో చార్జీల మోత మోగిస్తున్న ఆర్టీసీ..తాజాగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. బస్‌పాస్ చార్జీలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను ఇంచుమించు రెట్టింపు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. నగరంలో సాధారణ నెలవారీ బస్‌పాస్‌లతో (జీబీటీ)పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు, సాధారణ క్వార్టర్లీ పాస్‌లు, గ్రేటర్ హైదరాబాద్ క్వార్టర్లీ పాస్‌లను ఎక్కువ మంది విద్యార్థులు వినియోగిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి కాలేజీ వరకు వెళ్లి వచ్చేందుకు రూట్ పాస్‌లకు కూడా డిమాండ్ బాగా ఉంటుంది. ఇలా వివిధ రకాల పాస్‌లను వినియోగిస్తున్న విద్యార్థుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం ప్రతి నెలా ఆర్టీసీకి ప్రస్తుతం రూ.8.5 కోట్ల వరకు చెల్లిస్తుండగా తాజా పెంపుతో మరో రూ.5 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ప్రస్తుతం సాధారణ నెల వారీ పాస్ రూ.165 ఉండగా, తాజాగా రూ.300 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే క్వార్టర్లీ పాస్ రూ.495 నుంచి రూ.650 వరకు పెరగవచ్చునని అంచనా. ఏ బస్‌పాస్‌పైన ఎంత వరకు చార్జీలు పెరిగాయనే అంశాన్ని బుధవారం అర్ధరాత్రి వరకు కూడా ఆర్టీసీ స్పష్టం చేయకపోవడం గమనార్హం. చదవండి: (సదరం స్కాంపై ఏసీబీ కేసు!) -
Hyderabad: గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7
సాక్షి, హైదరాబాద్: సిటీబస్సు ఇక 24 గంటలు పరుగులు తీయనుంది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పటికే పలు మార్గాల్లో నైట్‌బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆలస్యంగా నగరానికి చేరుకొనే ప్రయాణికులు, తెల్లవారు జామునే దూరప్రాంతాలకు బయలుదేరేవారికి ఈ బస్సులు అనుకూలంగా ఉన్నాయి. అర్ధరాత్రి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లేందుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి వస్తోంది. మరోవైపు ప్రయాణికుల భద్రతకూడా ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ లభిస్తోందని, డిమాండ్ మేరకు నగరంలోని మరిన్ని మార్గాల్లో బస్సులను ప్రవేశపెడుతామని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్‌మేనేజర్ వెంకన్న తెలిపారు. ఈ రూట్లలో నైట్ బస్సులు... ►సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వివిధ మార్గాల్లో నైట్ బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 200 రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. 80 ప్రధాన ఎక్స్‌ప్రెస్‌లు దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొంటాయి. వీటిలో కొన్ని అర్ధరాత్రి నగరానికి వస్తే మరి కొన్ని తెల్లవారు జామున సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుతాయి. అదే సమయంలో కొన్ని రైళ్లు ఉదయం 3.30 గంటల నుంచే బయలుదేరుతాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవడం కష్టంగా ఉన్నట్లు ఆర్టీసీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు ప్రస్తుతం ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులను నడుపుతున్నారు. ►సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము వరకు 2 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ తరువాత రెగ్యులర్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ►సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, బోరబండ, తదితర ప్రాంతాలకు కూడా నైట్ బస్సులను నడుపుతున్నారు. ఈ మార్గాల్లో ప్రతి అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ►సికింద్రాబాద్ చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి హయత్‌నగర్ వరకు మరో రెండు బస్సులు నడుస్తున్నాయి. అలాగే చిలకలగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు నైట్ బస్సులను నడుపుతున్నారు. ►మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి లింగంపల్లి నైట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అన్ని పాస్‌లకు అనుమతి... ►ఈ నైట్ బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతిస్తారు. ►24 గంటల పాటు చెల్లుబాటయ్యే ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్లపైనా ప్రయాణికులు నైట్ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. -
సిటీ బస్సుల పెంపునకు ఆర్టీసీ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం కింద ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా కేంద్రం నిధులు ఇస్తుంది. ఈ నిధులతో ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సిటీ సబర్బన్ సర్వీసులు పెంచుకునే అవకాశం ఉంది. సెట్విన్ తరహాలో బస్సులను ప్రవేశపెట్టడం, డిపోల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. కేంద్ర నిధులతో నిరుద్యోగ యువత సెట్విన్ తరహా బస్సులు కొనుక్కుని బస్సు ఆపరేటర్లుగా మారి సొంతంగా నడుపుకొనేందుకు అవకాశముంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 1,100 సిటీ సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. గుంటూరులో సిటీ సర్వీసులు తిప్పేందుకు గతంలో ప్రయత్నించినా.. ఆర్టీసీకి కిలోమీటరుకు భారీ నష్టం వస్తుందని వాటి జోలికి వెళ్లలేదు. మిగిలిన నగరాల్లోనూ సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (యూఎంటీసీ) ద్వారా అధ్యయనం చేయించనుంది. ఆర్టీసీ ఇప్పటికే కాకినాడ నగరంలో అధ్యయనం చేసింది. ఇక్కడ సిటీ సర్వీసులు పెంచేందుకు కాకినాడకు 20 కి.మీ. పరిధిలో 215 సిటీ సర్వీసులు నడిపేలా ప్రతిపాదనల్ని యూఎంటీసీకి అందించింది. మిగిలిన చోట్ల అధ్యయనం చేసి ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 20 కి.మీ. వరకు.. మొత్తం పదివేల సిటీ బస్సుల్ని తిప్పడం ఆర్టీసీ లక్ష్యంగా ఉంది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణాను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం ద్వారా ఆర్టీసీలను ఆదుకోవాలని నిర్ణయించింది. దీని ప్రకారం కిలోమీటరుకు రూ.7 వంతున సబ్సిడీ రూపంలో ఆర్టీసీకి ఇవ్వనుంది. రాష్ట్రంలో భారీగా సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విజయవాడలో 650కి పైగా సిటీ సర్వీసులు తిప్పుతున్నా.. ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని, ఇక్కడ సర్వీసులు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. కేంద్ర పథకం కింద గ్రాంటుగా నిధులిస్తే తొలివిడత రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో మూడువేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. -
సిటీ బస్ సర్వీసులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని పలు డిపోల్లో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రతి డిపో నుంచి 12 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అయితే నగరంలో సిటీ బస్సుల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇక లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రమంతటా బస్సులు నడుస్తున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ నగరంలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రత తగ్గకపోవడంతో సిటీ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రధానమైన రూట్లలో బస్సులు నడిపేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించారు. మరోవైపు త్వరలోనే సిటీ బస్సులు కూడా నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (నవంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు) సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. షేర్ ఆటోల్లో కూడా పెద్ద సంఖ్యలో జనం ప్రయాణించే వారు. కానీ అది ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో షేర్ ఆటోలను తక్కువ మందే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు మెట్రో సర్వీసులు కూడా ప్రారంభం కావడంతో సిటీ బస్సులు కూడా నడపాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
ఈ నెల 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు!
సాక్షి, అమరావతి: ఈ నెల 20 నుంచి ప్రధాన నగరాల్లో సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాతపరీక్షలు ఉండడంతో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉంది. 10 లక్షల మంది పరీక్షలు రాస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ► రాష్ట్రంలో మే 21 నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ► అప్పటి నుంచి అన్ని జిల్లాల్లో రోజూ 3 వేలకు పైగా సర్వీసులను తిప్పుతూ 3.50 లక్షల మందిని ఆర్టీసీ చేరవేస్తోంది. ► అయితే విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించలేదు. ► సచివాలయ ఉద్యోగాలకు పరీక్షల నేపథ్యంలో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం ఫైల్‌ను పంపింది. ఆయన, సీఎస్ నీలం సాహ్ని నిర్ణయం తీసుకుని సిటీ బస్సు సర్వీసులకు అనుమతి ఇస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
సిటీ బస్సులు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి నడపాలనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, సిటీ బస్సులను నడిపే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం నుంచి మంగళవారం రాత్రి వరకు మౌఖిక ఆదేశాలు కూడా అందలేదని తెలుస్తోంది. ‘కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడిపేందుకు మేం సిద్ధమయ్యాం. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఓకే అంటే బస్సులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం రాత్రి ‘సాక్షి’తో చెప్పారు. మెట్రో రైళ్లలో ప్రయాణికులను నియంత్రించేందుకు పూర్తి అవకాశం ఉంది. కానీ సిటీ బస్సుల విషయంలో అది సాధ్యం కాదు. కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో, సిటీ బస్సుల్లో ప్రయాణికులు అదుపుతప్పితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇప్పట్లో నడపకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. -
హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
-
హైదరాబాద్: రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోనూ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో గత 70 రోజులుగా సిటీ బస్సులు రోడ్డెక్కని విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు ఏ విధంగా నడపాలనే దానిపై చర్చించారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. సిటీలో బస్సు సర్వీసులు లేకపోవటంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. ఇక షేర్ ఆటోల్లో ప్రయాణం ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారు. దాంతో నగర రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం అనంతరం సిటీ బస్సు సర్వీసులపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
వారం రోజుల్లో సిటీ బస్సులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన నేపథ్యంలో నగరంలోనూ సిటీ సర్వీసులను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 31తో నాలుగో విడత లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో కేం ద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలైన నేపథ్యంలో.. సిటీ బస్సులు లేకపోవటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా సర్వీసులు ప్రారంభించిట్లే.. కరోనా నిబంధనలతో సిటీ సర్వీసులు కూడా ప్రారంభించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో వీటిని ప్రారంభిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న అధికారులు.. వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేనెల 5వ తేదీకి అటుఇటుగా బస్సులు ప్రారంభించే అవకాశం ఉందని ఆర్టీసీలో ప్రచారం జరుగుతోంది. కండక్టర్ లేని ప్రతిపాదన వద్దు..: కరోనా నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా కండక్టర్లు బస్సుల్లో కాకుండా స్టేజీల వద్దే టికెట్లు జారీ చేసే ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులు రూపొందించారు. ప్రతి స్టేజీలో ఇద్దరు చొప్పున కండక్టర్లు ఉండాలని, ఒకరు టికెట్ జారీ చేస్తే మరొకరు దిగే ప్రయాణికుల వద్ద టికెట్లు తనిఖీ చేయాలనేది ఆ ప్లాన్. కానీ దీన్ని ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లా సర్వీసుల తరహాలోనే కండక్టర్లతో కూడిన బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. నిలబడి ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వవద్దని నిర్ణయించారు. జిల్లా సర్వీసుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. కానీ, సిటీ బస్సులకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎగబడే పరిస్థితి ఉండటంతో నిలబడకుండా చూడటం కష్టసాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. సీట్లు భర్తీ అయ్యాక అదనంగా ఎక్కేవారిని కండక్టర్లు నియంత్రించలేరని, దీనివల్ల ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలో తీవ్రమైన ట్రాఫిక్.. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. షేర్ ఆటోల్లో కూడా పెద్ద సంఖ్యలో జనం ప్రయాణించే వారు. కానీ అది ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో షేర్ ఆటోలను తక్కువ మందే ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారు. లాక్డౌన్ వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించిన వారు ఇప్పుడు సొంత వాహనాల్లో వస్తుండటంతో నగర రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రోజుల్లో ఉన్న ట్రాఫిక్ కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ముఖ్యంగా బైక్‌ల సంఖ్య బాగా పెరిగింది. గతంలో ఉదయం, సాయంత్రం ఆఫీసుల ప్రారంభం, ముగిసే వేళల్లో రోడ్లపై వాహనాలు కన్పించేవి. ఇప్పుడు మధ్యాహ్నం పూట కూడా చిన్న రోడ్లు.. బైక్‌లతో నిండిపోతున్నాయి. ప్రారంభంలో కొన్ని రూట్లకే.. ప్రస్తుతం నగరంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా వెలుగు చూస్తున్నాయి. జియాగూడ, ఆసిఫ్‌నగర్, పాతబస్తీలో ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతాలకు కాకుండా మిగతా ప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. సికింద్రాబాద్, మేడ్చల్, రామచంద్రాపురం, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మాదాపూర్.. తదితర ప్రాంతాల వైపు ఎక్కువగా తిప్పాలని భావిస్తోంది. కాగా, ప్రస్తుతం డొమెస్టిక్ విమానాలు మొదలు కావటంతో విమానాశ్రయంలో కార్యకలాపా లు ప్రారంభమయ్యాయి. నిత్యం 50 వర కు ఆర్టీసీ బస్సులు విమాన ప్రయాణికుల సేవలో ఉండేవి. ప్రస్తుతం అవి నడవట్లేవు. దీంతో విమానాశ్రయానికి వెళ్లేవారు సొంత వాహనాలనే వాడుతున్నారు. -
కిటికిటలాడుతున్న మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల రద్దుతో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు కిటికిటలాడుతున్నాయి. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధాన మార్గాల్లోనే బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుమారు 1000 బస్సులను రద్దు చేసేందుకు నిర్ణయించిన గ్రేటర్ ఆర్టీసీ.. దశల వారీగా బస్సుల సంఖ్యను తగ్గిస్తోంది. ఇప్పుటి దాకా 600 బస్సులను రద్దు చేయగా, వేల సంఖ్యలో ట్రిప్పులకు కోతపెట్టారు. రాత్రి వేళల్లో సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల వరకు ఆఖరి మెట్రో బయలుదేరే విధంగా ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు వేళలను మార్చారు. దీంతో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కాలం నుంచి పెరుగుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య ఇప్పటికే 4 లక్షల మైలు రాయిని దాటింది. వారం రోజులుగా మరో 24 వేల మంది ప్రయాణికులు అదనంగా పెరిగినట్టు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 1150 రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మరిన్ని బస్సులు రద్దు కానున్నాయి. దీంతో సిటీ బస్సు ప్రయాణికుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. ఒకవైపు చార్జీల పెంపు వల్ల కొంత మేర ఆర్టీసీ ఆదాయం పెరిగినప్పటికీ ఆకస్మాత్తుగా బస్సులను తగ్గించడంతో ప్రయాణికుల ఆదరణను కోల్పోవాల్సి రావడం గమనార్హం. ఆదాయం వచ్చే రూట్లలోనూ ట్రిప్పుల కోత నష్టాల నుంచి గట్టెక్కేందుకు బస్సుల రద్దునే పరిష్కారంగా భావిస్తున్న ఆర్టీసీ ఏకపక్ష నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆర్టీసీకి ఆదాయం వచ్చే మార్గాల్లోనూ బస్సులు రద్దు చేస్తున్నారని కండక్టర్లు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఏళ్ల తరబడి బస్సులు నడుపుతున్నాం. ఏ రూట్లో ఎంత ఆదాయం వస్తుందో అధికారుల కంటే మాకే ఎక్కువ తెలుసు. కానీ బస్సులను రద్దు చేయడమే పనిగా పెట్టుకోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆదాయాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది’ అని రాణిగంజ్–1 డిపోకు చెందిన ఓ కండక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. కోఠి–ఈసీఐఎల్, సికింద్రాబాద్–సనత్‌నగర్, నాంపల్లి–హేమానగర్, ఎల్బీనగర్–బీహెచ్ఈఎల్ వంటి రూట్లలో బస్సులు తగ్గాయి. ఉదయం 6 గంటలకు ముందు బయలుదేరే బస్సుల్లో 80 శాతం వరకు తగ్గించినట్లు అంచనా. అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ట్రిప్పుల సంఖ్యను భారీగా తగ్గించారు. గ్రేటర్లో గతంలో రోజుకు 3,550 బస్సులు రాకపోకలు సాగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 2,950కి చేరింది. దశలవారీగా మరిన్ని బస్సులు రద్దు చేయనున్నారు. గతంలో రోజుకు 9.5 లక్షల కి.మీ తిరిగితే ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 7 లక్షలకు పడిపోయింది. జనవరిలో జేబీఎస్–ఎంజీబీఎస్ ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తున్న జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్‌లో జనవరి చివరి వారంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 11 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి మీదుగా కోఠి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు చేరుకొనే అవకాశముంది. పెరిగిన మెట్రో దూకుడు ఆర్టీసీ డీలా పడిపోవడంతో మెట్రో దూకుడు పెరిగింది. ఆర్టీసీ సమ్మె కాలం నాటికి 3 లక్షలు ఉన్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగి ప్రస్తుతం 4.24 లక్షల మందికి చేరింది. హైటెక్ సిటీ నుంచి రోజుకు సుమారు 6,125 మంది రాకపోకలు సాగిస్తుండగా, అమీర్‌పేట్ నుంచి మరో 4,102 మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. అలాగే మరో ప్రధాన మెట్రో స్టేషన్ ఎల్బీనగర్ నుంచి 3,950 మంది, మియాపూర్ నుంచి 5,150 మంది, బేగంపేట్ నుంచి 1500 మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కూకట్పల్లి నుంచి 2,200, దిల్సుఖ్నగర్ నుంచి మరో 1430 మంది పెరిగినట్లు అంచనా. మొత్తంగా గతంలో 4 లక్షలు ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.24 లక్షలు దాటిపోయింది. సిటీబస్సుల ట్రిప్పులు తగ్గించే కొద్దీ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. -
సిటీ బస్సు.. బోర్డు తుస్సు
నగరంలో ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. రవాణా సాధనాలు ఎన్ని మారినా ప్రజల నుంచి వీటికున్న ఆదరణ అద్భుతంగా ఉంది. కానీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. సిటీ బస్సుల డెస్టినేషన్ బోర్డుల తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో సుమారు 40 శాతం బస్సులు అస్పష్టమైన బోర్డులతోనే దర్శనమిచ్చాయి. డెస్టినేషన్ బోర్డులు రంగు వెలిసి ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. బోర్డులపై అక్షరాలు కనిపించక తాము ఎక్కాల్సిన బస్సు ఏదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఏ బస్సు ఎటు వెళ్తుందో తెలియక బస్టాప్‌లో ఆగినా ప్రయాణికులు ఎక్కేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రతిరోజు ఆ రూట్లోనే రాకపోకలు సాగించే వాళ్లకు సైతం తప్పడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఆర్టీసీ సేవలు మసకబారుతున్నాయి. మెట్రోరైలు వచ్చాక సిటీ బస్సుల వినియోగం తగ్గుతుందని లెక్కలు వేసినా అవన్నీ తప్పేనని తేలిపోయింది. ఇప్పటికీ ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. వందలాది కాలనీలకు, ప్రధాన రహదారులకు, నగర శివారు ప్రాంతాలకు ఈ బస్సులే కనెక్టివిటీగా ఉన్నాయి. కానీ బస్సుల నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. అధికారులు బస్సులను డిపో నుంచి రోడ్డెక్కించడం వరకే పరిమితమవుతున్నారు గాని, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. అన్ని రూట్లలోనూ ఇంతే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రేతిఫైల్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, బ్లూసీ హోటల్, గురుద్వారా తదితర ప్రాంతాల నుంచి రోజూ సుమారు 1500 బస్సులు వివిధ ప్రాంతాలకు తిరుగుతుంటాయి. పటాన్చెరు, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, బాలానగర్, అల్వాల్, రిసాలాబజార్, బోయిన్పల్లి, బొల్లారం, జూపార్కు, ఆఫ్జల్‌గంజ్, నాంపల్లి, ఈసీఐఎల్, కోఠి, మహాత్మ గాంధీ బస్‌స్టేషన్, బార్కాస్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాలకు వేలాది టిప్పులు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్ నుంచే వివిధ ప్రాంతాలకు కనీసం 10 వేల ట్రిప్పులకు పైగా బస్సులు తిరుగుతాయి. ఈ ప్రాంతం నుంచే సుమారు 15 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ ప్రయాణికుల డిమాండ్, ఆదరణకు తగినవిధంగా సదుపాయాలు మాత్రం లేవు. సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు, బీహెచ్ఈఎల్ వైపు, మల్కాజిగిరి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, కోఠి తదితర మార్గాలకు వెళ్లే బస్సుల్లో చాలావాటికి అస్పష్టమైన డెస్టినేషన్ బోర్డులే దర్శనమిచ్చాయి. బస్సు దగ్గరకు వచ్చే దాకా బోర్డు కనిపించదు. తీరా తెలిసి అది ఏ రూట్లో వెళ్తుందో కనుక్కోవడం కూడా కష్టమే. బస్సు రూట్‌తో పాటు ఈ ప్రాంతం (వయా) మీదుగా వెళ్తుందో స్పష్టంగా తెలియాలి. ఆ వివరాలు కూడా బోర్డులపై లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ♦ సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ (16ఏ రూట్) వరకు ప్రతి రోజు వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్, మెట్టుగూడ, మల్కాజిగిరి, వాణీనగర్, నేరేడ్మెట్ మీదుగా ఈ బస్సులు ఈసీఐఎల్‌కు వెళ్తాయి. కానీ ఈ బస్సులు అస్పష్టమైన బోర్డులతోనే తిరుగుతున్నాయి. ♦ సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లే బస్సులు కొన్ని సాయినగర్ మీదుగా వెళ్తాయి. కానీ ‘సాయినగర్’ అనే పేరు కనిపించక చాలా మంది ఎక్కేస్తున్నారు. తీరా అది సాయినగర్ మీదుగా వెళ్తుందని తెలిసి ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ తెలుపు రంగు బోర్డులపైన కనీసం వంద అడుగుల దూరంలో ఉన్న ప్రయాణికులకు కూడా స్పష్టంగా కనిపించేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూట్ వివరాలతో డెస్టినేషన్ బోర్డులు ఉండాలి. కానీ చాలా బస్సులకు రంగులు వెలిశాయి. ♦ ఎల్ఈడీ డిస్ప్లే ఉన్న మెట్రో బస్సుల్లోనూ స్పష్టత కొరవడింది. కొరవడిన సమీక్ష.. ప్రతి 6 నెలలకు ఓసారి బస్సుల డెస్టినేషన్ బోర్డులను మార్చాలి. ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పాటు చేయాలి. ఇందుకు డిపో మేనేజర్ స్థాయి అధికారులకు ఆర్టీసీ పూర్తి బాధ్యతలను అప్పగించింది. కానీ చాలామంది డీఎంలు బోర్డుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను కూడా పట్టించుకోరు. అవసరమైన చోట ఏర్పాటు చేస్తాం... డెస్టినేషన్ బోర్డుల బాధ్యతను డిపో మేనేజర్లకే అప్పగించాం. బస్సులను పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకొనే అవకాశం వారికి ఉంది. అయినా ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు అన్ని డిపోల్లో మరోసారి పరిశీలించి డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తాం. – పురుషోత్తమ్ నాయక్, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాలుగేళ్లుగా పోరాడుతున్నా డెస్టినేషన్ బోర్డులు సరిగ్గా లేవని గత 4 సంవత్సరాలుగా డిపో మేనేజర్ నుంచి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు వరకు, చైర్మన్ వరకు అందరినీ కలిశాను. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దాదాపు అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక బస్సుల టైమింగ్స్ కూడా ఎక్కడా కనిపించవు. ఎక్కడో ఓ చోట బస్టాపులో టైమింగ్స్ బోర్డు ఉంటుంది. కానీ ఆ టైమ్‌లో బస్సు ఉండదు. – జేఎన్ఎన్ శాస్త్రి, రిటైర్డ్ ఇంజినీర్ -
గాల్లో తేలిపోవచ్చు
బెంగళూరులో ‘మెట్రినో’! ‘కేబుల్ కార్’ తరహాలో అత్యాధునిక రవాణా వ్యవస్థ ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం బెంగళూరు: మెట్రో రైలు, మోనో రైలు, సిటీ బస్ సర్వీసులు ఇలా ఎన్ని ప్రజారవాణా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా నగరంలో ఇంకా ట్రాఫిక్ జంజాటం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో గాల్లో ప్రయాణం సాగించే కేబుల్ కార్ వంటి ‘మెట్రినో’ రవాణా వ్యవస్థను బెంగళూరులో అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు వాయు కాలుష్యాన్ని సైతం తగ్గించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన పోమా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో నగరంలో మెట్రినో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి గల అవకాశాలు, ఇతర అంశాలపై బెంగళూరు నగర అభివృద్ధి శాఖ సీఎం సిద్ధరామయ్యకు నివేదిక అందజేయనుంది. ఈ నివేదికకు కనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకారం లభిస్తే త్వరలోనే బెంగళూరు నగరంలో మరో చారిత్రాత్మక రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏమిటీ మెట్రినో..... రవాణా వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, గాల్లో తేలేలా రూపొందించిన రవాణా వ్యవస్థనే మెట్రినోగా పిలుస్తున్నారు. ఈ మెట్రినో కేబుల్ కార్ తరహాలో పనిచేస్తుంది. కేబుల్ కార్ తరహాలో కనిపించే వాహనంలో ఐదు మంది కూర్చుని ప్రయాణించవచ్చు. ఇది పూర్తిగా డ్రైవర్ లెస్ విధానంలో పనిచేస్తుంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనం లేకుండా కరెంటుతో నడిచే ఈ వాహనంలో ఏసీ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక ఈ వాహనం రాకపోకలన్నింటిని ఒక కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ కేబుల్ కార్ తరహా వాహనాలు ఆకాశ మార్గంలో ప్రయాణించేందుకు ఫోల్స్ ఏర్పాటు చేసి పైన ఒక దారిని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎక్కువ భూమి అవసరం లేదు. అంతేకాదు నిర్మాణ వ్యయం కూడా ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ. మెట్రో రైలు నిర్మాణానికి కిలోమీటరుకు రూ.250 కోట్ల వరకు వ్యయం అయితే, మెట్రినో రవాణా వ్యవస్థను నిర్మించేందుకు గాను కిలోమీటరుకు రూ.40-50కోట్ల వ్యయం అవుతుందని అంచనా. వాయు కాలుష్యాన్ని నివారించే దిశగా..... ఇక మెట్రినో రవాణా వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగరంలో ట్రాఫిక్ జంజాటాన్ని తప్పించడంతో పాటు వాయు కాలుష్యాన్ని సైతం నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల మెట్రినో రవాణా వ్యవస్థను దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. తద్వారా ఢిల్లీ నగర వాసులకు అత్యంత పెద్ద సమస్యగా పరిణమించిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేదిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సైతం ‘మెట్రినో’ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. -
సిటీ బస్సుల రూటు మళ్లింపు
సాక్షి,సిటీబ్యూరో: కోఠి ఉమెన్స్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆ రూట్లో వెళ్లే పలు బస్సులను దారిమళ్లించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులను చాదర్‌ఘాట్, రంగమహల్ చౌరస్తా,పుతిలీబౌలీ మీదుగా నడుపనున్నట్లు పేర్కొన్నారు. హయత్‌నగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ మార్గంలో వచ్చే 158, 187,217,218/218ఎల్,225 రూట్లకు చెందిన బస్సులు ప్రస్తుతం కోఠీ విమెన్స్ కాలేజ్ మీదుగా కొండాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు వైపు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉదయం,సాయంత్రం ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి. తరచుగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. దీన్ని దష్టిలో ఉంచుకొని గ్రేటర్ ఆర్టీసీ కోఠీ ఉమెన్స్ కాలేజీ వరకు వెళ్లకుండా చాదర్‌ఘాట్ నుంచి రంగమహల్ చౌరస్తా మీదుగా వెళ్లేటట్లు రూట్ మళ్లించింది.ఏసీ బస్సులు మినహా మిగతా 109 ఆర్డినరీ, మెట్రో డీలక్స్,మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ కొత్త రూట్లో రాకపోకలు సాగిస్తాయి. ఈ బస్సులు ప్రతి రోజు సుమారు 762 ట్రిప్పులు తిరుగుతాయి.