కిటికిటలాడుతున్న మెట్రో రైళ్లు | Hyderabad Metro Trains Heavy Rush Of Passengers | Sakshi
Sakshi News home page

కిటికిటలాడుతున్న మెట్రో రైళ్లు

Published Sun, Dec 22 2019 4:08 PM | Last Updated on Sun, Dec 22 2019 4:15 PM

Hyderabad Metro Trains Heavy Rush Of Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిటీ బస్సుల రద్దుతో హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైళ్లు కిటికిటలాడుతున్నాయి. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధాన మార్గాల్లోనే బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య  క్రమంగా పెరుగుతోంది. సుమారు 1000 బస్సులను రద్దు చేసేందుకు నిర్ణయించిన  గ్రేటర్‌ ఆర్టీసీ.. దశల వారీగా బస్సుల సంఖ్యను తగ్గిస్తోంది. ఇప్పుటి దాకా 600 బస్సులను రద్దు చేయగా, వేల సంఖ్యలో ట్రిప్పులకు కోతపెట్టారు. రాత్రి వేళల్లో సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఈ క్రమంలో రాత్రి 11 గంటల వరకు ఆఖరి మెట్రో  బయలుదేరే విధంగా ఇటీవల హైదరాబాద్‌ మెట్రో రైలు వేళలను మార్చారు. దీంతో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కాలం నుంచి  పెరుగుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య ఇప్పటికే 4 లక్షల మైలు రాయిని దాటింది. వారం రోజులుగా మరో 24 వేల మంది ప్రయాణికులు అదనంగా పెరిగినట్టు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 1150 రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మరిన్ని బస్సులు రద్దు కానున్నాయి. దీంతో సిటీ బస్సు ప్రయాణికుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. ఒకవైపు చార్జీల పెంపు వల్ల కొంత మేర ఆర్టీసీ ఆదాయం పెరిగినప్పటికీ ఆకస్మాత్తుగా బస్సులను తగ్గించడంతో ప్రయాణికుల ఆదరణను కోల్పోవాల్సి రావడం గమనార్హం. 

ఆదాయం వచ్చే రూట్లలోనూ ట్రిప్పుల కోత 
నష్టాల నుంచి గట్టెక్కేందుకు బస్సుల రద్దునే పరిష్కారంగా భావిస్తున్న ఆర్టీసీ ఏకపక్ష నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆర్టీసీకి ఆదాయం వచ్చే మార్గాల్లోనూ బస్సులు రద్దు చేస్తున్నారని కండక్టర్లు, డ్రైవర్లు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఏళ్ల తరబడి బస్సులు నడుపుతున్నాం. ఏ రూట్లో  ఎంత ఆదాయం వస్తుందో అధికారుల కంటే మాకే ఎక్కువ తెలుసు. కానీ బస్సులను రద్దు చేయడమే పనిగా పెట్టుకోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆదాయాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది’ అని రాణిగంజ్‌–1 డిపోకు చెందిన ఓ కండక్టర్‌ విస్మయం వ్యక్తం చేశారు. 

కోఠి–ఈసీఐఎల్, సికింద్రాబాద్‌–సనత్‌నగర్, నాంపల్లి–హేమానగర్, ఎల్‌బీనగర్‌–బీహెచ్‌ఈఎల్‌ వంటి రూట్లలో బస్సులు తగ్గాయి. ఉదయం 6 గంటలకు ముందు బయలుదేరే బస్సుల్లో 80 శాతం వరకు తగ్గించినట్లు అంచనా. అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ట్రిప్పుల సంఖ్యను భారీగా తగ్గించారు. గ్రేటర్‌లో గతంలో రోజుకు 3,550 బస్సులు రాకపోకలు సాగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 2,950కి చేరింది. దశలవారీగా మరిన్ని బస్సులు రద్దు చేయనున్నారు. గతంలో రోజుకు 9.5 లక్షల కి.మీ తిరిగితే ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 7 లక్షలకు పడిపోయింది. 

జనవరిలో జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ 
ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నడుస్తున్న జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ కారిడార్‌లో జనవరి చివరి వారంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 11 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో సికింద్రాబాద్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి మీదుగా కోఠి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు చేరుకొనే అవకాశముంది.

పెరిగిన మెట్రో దూకుడు 
ఆర్టీసీ డీలా పడిపోవడంతో మెట్రో దూకుడు పెరిగింది. ఆర్టీసీ సమ్మె కాలం నాటికి 3 లక్షలు ఉన్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగి ప్రస్తుతం 4.24 లక్షల మందికి చేరింది. హైటెక్‌ సిటీ నుంచి రోజుకు సుమారు 6,125 మంది రాకపోకలు సాగిస్తుండగా, అమీర్‌పేట్‌ నుంచి మరో 4,102 మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. అలాగే మరో ప్రధాన మెట్రో స్టేషన్‌ ఎల్బీనగర్‌ నుంచి 3,950 మంది, మియాపూర్‌ నుంచి 5,150 మంది, బేగంపేట్‌ నుంచి 1500 మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కూకట్‌పల్లి నుంచి 2,200, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మరో 1430 మంది పెరిగినట్లు అంచనా. మొత్తంగా గతంలో 4 లక్షలు ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.24 లక్షలు దాటిపోయింది. సిటీబస్సుల ట్రిప్పులు తగ్గించే కొద్దీ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement