తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసీ)కు ప్రయాణీకులు దైవంతో సమానమని, టిక్కెట్ తీసుకుని ప్రయాణిస్తున్నవారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్ గారు అన్నారు. విధి నిర్వహణలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే కాదు వారిపట్ల మానవత్వంతో వ్యవహరించడంలోనూ సిబ్బంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండటం శుభపరిణామమని ఆయన కొనియాడారు.
బస్సులో గుండెపోటుతో మరణించిన ఓ ప్రయాణికుడి మృతదేహాన్ని మానవతా దృక్ఫథంతో వ్యవహరించి అదే బస్సులో ఇంటికి చేర్చిన మహబూబాబాద్ డిపో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్యలను శనివారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో అయన అభినందించారు. ప్రత్యేకించి ఆ సమయంలో చొరవ తీసుకున్న మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ ను కూడా ప్రశంసించి శాలువా, ప్రశంసా పత్రంతో పాటు ప్రత్యేక బహుమతి అందించి వారి సేవలు ప్రశంసనీయమన్నారు.
బస్సులో మృతదేహాన్ని తరలించడంలో పెద్దమనసుతో సహకరించిన ప్రయాణికులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించే గుణం సిబ్బందిలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వివరాల్లోకి వెళితే, మహబుబాబాద్ డిపోకు చెందిన బస్సు ఈ నెల 14న సాయంత్రం ఖమ్మం నుంచి మహబుబాబాద్‌కు 52 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కురవి మండలం మోదుగులగూడెనికి చెందిన కె.హుస్సేన్(57), బస్సు మైసమ్మ గుడి దగ్గరికి రాగానే నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న బస్సు కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ కొమురయ్యలు సమయస్పూర్తితో వ్యవహారించారు. తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్ నిర్వహించారు. లాభం లేకపోవడంతో 108కి సమాచారం అందించారు. అప్పటికే హుస్సేన్ మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. మృతదేహాన్ని బాధితుడి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి 108 సిబ్బంది నిరాకరించారు. దీంతో కండక్టర్, డ్రైవర్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. బస్సులోనే 30 కిలోమీటర్లు మృతదేహాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. కండక్టర్, డ్రైవర్ల చొరవ అభినందనీయమని, సంస్థ వారిని చూసి ఎంతో గర్విస్తోందని సంస్థ ఎండీ సజ్జనర్ చెప్పారు.
టిఎస్‌ఆర్టీసీ సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజలకు సంస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సేవా భావంతో వ్యవహరిస్తున్న సిబ్బందికి సంస్థలో తప్పక గుర్తింపు ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment