
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి నడపాలనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, సిటీ బస్సులను నడిపే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం నుంచి మంగళవారం రాత్రి వరకు మౌఖిక ఆదేశాలు కూడా అందలేదని తెలుస్తోంది. ‘కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడిపేందుకు మేం సిద్ధమయ్యాం. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఓకే అంటే బస్సులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం రాత్రి ‘సాక్షి’తో చెప్పారు. మెట్రో రైళ్లలో ప్రయాణికులను నియంత్రించేందుకు పూర్తి అవకాశం ఉంది. కానీ సిటీ బస్సుల విషయంలో అది సాధ్యం కాదు. కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో, సిటీ బస్సుల్లో ప్రయాణికులు అదుపుతప్పితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇప్పట్లో నడపకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment