గాల్లో తేలిపోవచ్చు
బెంగళూరులో ‘మెట్రినో’!
‘కేబుల్ కార్’ తరహాలో అత్యాధునిక రవాణా వ్యవస్థ
ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం
బెంగళూరు: మెట్రో రైలు, మోనో రైలు, సిటీ బస్ సర్వీసులు ఇలా ఎన్ని ప్రజారవాణా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా నగరంలో ఇంకా ట్రాఫిక్ జంజాటం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో గాల్లో ప్రయాణం సాగించే కేబుల్ కార్ వంటి ‘మెట్రినో’ రవాణా వ్యవస్థను బెంగళూరులో అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు వాయు కాలుష్యాన్ని సైతం తగ్గించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన.
ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన పోమా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో నగరంలో మెట్రినో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి గల అవకాశాలు, ఇతర అంశాలపై బెంగళూరు నగర అభివృద్ధి శాఖ సీఎం సిద్ధరామయ్యకు నివేదిక అందజేయనుంది. ఈ నివేదికకు కనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకారం లభిస్తే త్వరలోనే బెంగళూరు నగరంలో మరో చారిత్రాత్మక రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఏమిటీ మెట్రినో.....
రవాణా వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, గాల్లో తేలేలా రూపొందించిన రవాణా వ్యవస్థనే మెట్రినోగా పిలుస్తున్నారు. ఈ మెట్రినో కేబుల్ కార్ తరహాలో పనిచేస్తుంది. కేబుల్ కార్ తరహాలో కనిపించే వాహనంలో ఐదు మంది కూర్చుని ప్రయాణించవచ్చు. ఇది పూర్తిగా డ్రైవర్ లెస్ విధానంలో పనిచేస్తుంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనం లేకుండా కరెంటుతో నడిచే ఈ వాహనంలో ఏసీ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక ఈ వాహనం రాకపోకలన్నింటిని ఒక కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేసే సౌకర్యం ఉంటుంది.
ఈ కేబుల్ కార్ తరహా వాహనాలు ఆకాశ మార్గంలో ప్రయాణించేందుకు ఫోల్స్ ఏర్పాటు చేసి పైన ఒక దారిని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎక్కువ భూమి అవసరం లేదు. అంతేకాదు నిర్మాణ వ్యయం కూడా ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ. మెట్రో రైలు నిర్మాణానికి కిలోమీటరుకు రూ.250 కోట్ల వరకు వ్యయం అయితే, మెట్రినో రవాణా వ్యవస్థను నిర్మించేందుకు గాను కిలోమీటరుకు రూ.40-50కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
వాయు కాలుష్యాన్ని నివారించే దిశగా.....
ఇక మెట్రినో రవాణా వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగరంలో ట్రాఫిక్ జంజాటాన్ని తప్పించడంతో పాటు వాయు కాలుష్యాన్ని సైతం నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల మెట్రినో రవాణా వ్యవస్థను దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. తద్వారా ఢిల్లీ నగర వాసులకు అత్యంత పెద్ద సమస్యగా పరిణమించిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేదిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సైతం ‘మెట్రినో’ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.