ఎక్కువ మంది లబ్దిదారులకు తొలిరోజు అక్కడే పంపిణీ
ఇంటి వద్దే పంపిణీ అన్న మాట.. ఆచరణలో కానరాలేదు
పలుచోట్ల పింఛన్ల పంపిణీలో రాజకీయ నేతల హడావుడి
బహిరంగ సభలకు వృద్ధులను పిలిచి పంపిణీ చేసిన వైనం
కక్షగట్టి కొన్ని చోట్ల పింఛన్‌లు ఆపేపిన నేతలు
తొలిరోజు 63.18 లక్షల మందికి పంపిణీ చేశామన్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పినప్పటికీ.. ఆచరణలో మాత్రం అది కనిపించడంలేదు. మెజార్టీ లబ్దిదారులను స్థానిక వార్డు, గ్రామ సచివాలయాల వద్దకు పిలిపించుకొని పింఛన్ల పంపిణీ చేశారు. కొన్ని చోట్ల చెట్ల కింద, రచ్చబండల వద్ద, ప్రైవేటు స్థలాల్లో పంపిణీ చేశారు. గతంలో రాజకీయాలకతీతంగా పింఛన్ల పంపిణీ జరిగితే.. ప్రస్తుతం అ«ధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పింఛన్ల పంపిణీ జరిగింది.
పింఛన్ల పండుగ పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ నేతల సమక్షంలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. పలు చోట్ల బహిరంగసభలు నిర్వహించి వృద్ధులను ఇబ్బంది పెట్టారు. కక్షగట్టి పింఛన్లు ఆపేసిన ఘటన పలుచోట్ల జరిగింది. కాగా, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 64,82,052 మంది పింఛన్‌దారులకు పంపిణీ చేసేందుకు రూ. 2,737 కోట్లు విడుదల చేశారు. గురువారం తొలి రోజు 63,18,881 మందికి రూ. 2,668.28 కోట్లు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజే 97.48 శాతం పింఛన్‌దారులకు పంపిణీ పూర్తి చేశామని వెల్లడించింది.
పింఛన్ల పంపిణీలో నేతలు
తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలో సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లకుండా గాం«దీవీధిలోని ఓ ఇంటి వద్దకు అందరినీ రమ్మని అక్కడే పింఛన్లు ఇచ్చారు. తిరుపతి కేవీబీపురం మండలంలోని రాయపేటు గ్రామ సచివాలయ పరిధిలో వగత్తూరు గ్రామంలో టీడీపీ నేతలు గోపాల్, సురేష్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు.
ప్రశ్నించాడని సాక్షి విలేకరి తల్లి పింఛన్ ఆపేశారు
పంచాయతీలకు రావాల్సిన నిధులు ఎందుకు పక్కదారి పడుతున్నాయని ప్రశ్నించినందుకు సాక్షి విలేకరి తల్లి పింఛన్‌ను నిలిపివేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలాకి మండలంలోని బెలమరపాలవలస పంచాయతీలో చేపల చెరువుకు బుధవారం వేలం జరిగింది. ఈ వేలంపాటలో వ చ్చిన సొమ్ములు స్థానిక సర్పంచ్‌కు కాకుండా అధికార పార్టీ నేతల వద్ద ఉంచటాన్ని అదే గ్రామానికి చెందిన ‘సాక్షి’ విలేకరి షణ్ముఖరావు ప్రశ్నించారు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి టీడీపీ నేతలు చేరవేశారు. దీంతో నేరుగా ఎమ్మెల్యే.. ఎంపీడీవో ఉషశ్రీకి ఫోన్ చేసి విలేకరి తల్లి అయిన చింతు రమణమ్మ వితంతు పింఛన్ ఆపేయాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. ప్రశ్నించే గొంతును నొక్కే చర్యలకు పాల్పడటం ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చుతుందని అన్నారు. నరసన్నపేట ప్రెస్‌క్లబ్ దీన్ని ఖండించింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని ఏపీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ అన్నారు.
కష్టాన్ని కొని తెచ్చుకున్నాం
మొన్నటి వరకు తెల్లవారక ముందే వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ అందించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఆధార్ కార్డు పట్టుకుని పింఛన్ ఎక్కడ ఇస్తారా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొందరైతే సచివాలయంలో పింఛన్ల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ‘ఎంతటి కష్టాన్ని కొనితెచ్చుకున్నాంరా నాయనా’ అంటూ వృద్ధులు బాధపడుతున్నారు. ఏలూరు నగరంలో గురువారం పలు డివిజన్లలో పింఛన్‌దారులు అవస్థలు పడుతూ కనిపించారు.
ఇదేం పింఛన్ల పంపిణీ ‘స్వామి’!
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల పల్లెపాలెంలో పెన్షన్లను బహిరంగ సభకు పిలిచి ఇవ్వడంపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం వృద్ధులను ఇలా బాధపెట్టడం ఏంటని మంత్రి తీరును పలువురు తప్పుబట్టారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించడంపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment