
తాడేపల్లి: ‘పవన్ కళ్యాణ్ నటుడు.. చంద్రబాబు రాజకీయాల్లో సహజ నటుడు’ అని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ, బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లోనే ప్రజలు ఈ రెండు పార్టీలను ఛీ కొట్టినా వారిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నది ఆ పార్టీ నేతలు చెప్పలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే, ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని చురకలంటించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిందని సజ్జల పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లభ్దిదారులకు అందాల్సిన సొమ్మును నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన రాళ్లదాడి హైడ్రామాను ప్రజలు గమనించారన్నారు. ‘టీడీపీ పనైపోయింది’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా చెప్తున్నారని విమర్శించారు. లోకేష్ దెబ్బకు టీడీపీ దివాళా తీసిందని ఆ పార్టీ నేతలే అంటున్నారని, దీన్నిబట్టి ఆ పార్టీ నేతలకి టీడీపీ పట్ల ఏమాత్రం చిత్తశుధ్ది ఉందో తెలిసిపోతుందన్నారు.
చదవండి: లోకేష్, అచ్చెన్న ఎడమొహం.. పెడమొహం
Comments
Please login to add a commentAdd a comment