
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ అంచనాలకు మించి రెండింతలు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ప్రజలు చెబుతున్నారన్నారు. సీఎం జగన్‌ను తామంతా విశ్వసిస్తున్నామని, తమ భవిష్యత్తు ఆయనలో కనిపిస్తోందని ప్రజలు బలంగా చెబుతున్నారన్నారు.
‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లభిస్తుందన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం,ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలసి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్‌ను సజ్జల ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. సజ్జల ఏమన్నారంటే..
ప్రజల ఆకాంక్షల మేరకు..
ప్రజలతో మమేకమయ్యేందుకు భారీ స్థాయిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పార్టీ పరంగా పనిచేసే వారు కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి నెరవేర్చేలా ముందుకెళ్తాం. ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి అంచనాలకు అనుగుణంగా నడుచుకునేలా భారీ కసరత్తు ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఎలా ఉండాలి? పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చాం.
14 రోజులపాటు కార్యక్రమం..
ఈ నెల 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరుగుతుంది. 7 లక్షల మంది సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులతో కూడిన క్షేత్ర స్థాయి సైన్యం ఈ కార్యక్రమంలో పదాతిదళంగా వ్యవహరిస్తుంది. వలంటీర్లు స్థానికంగా ఎంత ప్రాంతాన్ని కవర్ చేస్తారో అంతే పరిధిలో గృహ సారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. సచివాలయాల కన్వీనర్లతోపాటు మండల ఇన్‌చార్జ్‌లు, వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్ కో–ఆర్డినేటర్ వ్యవస్థలు ‘జగనన్నే మా భవిష్యత్తు’లో పూర్తిస్థాయిలో భాగస్వాములు అవుతారు.
ఈ యంత్రాంగం మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నడుస్తుంది. 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను కలుసుకుంటారు. గత సర్కార్‌కు, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరుగుతోంది. అర్హులైన కుటుంబాలను నూరుశాతం సంక్షేమ పథకాల పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో సర్వే ద్వారా వారి అభిప్రాయాల్ని సేకరిస్తాం. వికృత చేష్టలతో సంక్షేమ రథానికి అడ్డుపడుతున్న దుష్టశక్తులకు గుణపాఠం చెబుతాం.