చిట్టినగర్ కంసాలిపేట ప్రాంతాన్ని పట్టించుకోని ప్రభుత్వం
మూడు రోజులుగా ముంపులో స్థానికుల అగచాట్లు
350 బాధిత కుటుంబాలకు సాయం అందించిన సాక్షి బృందం
స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన ఆహారం పంపిణీ
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): కంసాలిపేటలో నివాసముంటున్న బుజ్జి భర్త పది రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆమె ఇంటిని వరద ముంచేసింది. సాయం కోసం ఆర్తనాదాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు చిన్న పిల్లలతో మూడు రోజులుగా ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ వరద ముంపులోనే బతుకుతోంది. అధికారులెవరూ ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదని, స్థానిక యువకులే సాయంగా నిలుస్తున్నారని చెబుతోంది. తాతల కాలం నుంచి కంసాలిపేట ఉందని, ఆ తరువాతే రాజరాజేశ్వరిపేట వచ్చిందని.. అయితే ఇప్పుడొచ్చిన అధికారులు కంసాలిపేట వాళ్లు లెక్కల్లో లేరని చెబుతున్నారని వాపోయింది.
350కిపైగా కుటుంబాలు జీవిస్తున్న కంసాలిపేట ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ఆమె పాలకులను ప్రశ్నిస్తోంది. బుడమేరు వరద ధాటికి పూర్తిగా మునిగిపోయిన ప్రాంతాల్లో ఒన్ టౌన్‌లోని చిట్టినగర్ వంతెన కిందనున్న కంసాలిపేట కూడా ఒకటి. దాదాపు 1500 మంది ప్రజలు ఇక్కడ జీవిసున్నారు. మూడు రోజులుగా పాలకులుగానీ, అధికారులుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పేటలో ఒక్క ఇల్లు కూడా నీట మునగకుండా లేదు. ఏ వస్తువూ మిగల్లేదు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, టిఫిన్ బళ్లు, బడ్డీ కొట్లు, సైకిళ్లు ఇలా ప్రతీదీ ఇంకా వరద ముంపులోనే ఉంది.
అక్కడక్కడా ఉన్న మేడలపైనే స్థానికులు గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగునీరు లేక అలమటిస్తున్నారు. చేతి పంపు నుంచి వచ్చే నీటితోనే కడుపు నింపుకుంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారి వద్దకు వెళ్లిన ‘సాక్షి’ బృందానికి తమగోడును చెప్పుకుని భోరుమన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ‘సాక్షి’ బృందం పలు స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆహారం, తాగు నీరు సమకూర్చింది. స్థానిక యువకుల సాయంతో ఇంటింటికీ తిరిగి స్వయంగా పంచిపెట్టింది. మూడు రోజులైనా తమ వద్దకు మీడియాతో సహా ఎవరూ రాలేదని, మొదటిసారి సాక్షి బృందం మాత్రమే వచ్చి తమకు సాయం చేసిందని బాధితులంతా చెమర్చిన కళ్లతో ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
‘సాక్షి’ ప్రతినిధులే వచ్చారు
మా కాలనీ నీళ్లలో ఉండిపోయింది. ఎవ్వరూ పలకరించడానికి రాలేదు. సాక్షి ప్రతినిధులు మాత్రమే వచ్చారు. ఇళ్లలోకి నీళ్లు చేరితో మిద్దెక్కి కూర్చున్నాం. వాడుకోవడానికి నీళ్లు కూడా లేవు. – వెంకటలక్ష్మి, కంసాలిపేట
మాపేట ప్రభుత్వానికి తెలియదట..
మా పేట నీళ్లలో మునిగిపోతే, మాకు తెలియదు. మీకు ఏమీ రావంటున్నారు. రాజరాజేశ్వరిపేట తప్ప మీపేట లెక్కల్లో లేదంటున్నారు. ఇప్పటి వరకు మాకు అన్నం పెట్టిన నాథుడే లేడు. సాక్షి మాత్రమే మాకు అండగా నిలిచింది. మా కుర్రోళ్లు జట్టుగా ఏర్పడి ట్యూబులపై తిరుగుతూ సాయం చేస్తున్నారు. – క్రీస్తుబాబు, కంసాలిపేట
Comments
Please login to add a commentAdd a comment