ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల అగచాట్లు
నవంబర్ మూడో వారం వచ్చినా అందని దుస్థితి
1వ తేదీనే జీతాలిస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం
గ్రంథాలయ వారోత్సవాలకూ పైసా విదల్చని సర్కారు
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఓ వైపు గొప్పలు చెబుతోంది.
కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గడిచిన ఐదు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకటో తేదీన పూర్తిస్థాయిలో జమైన దాఖలాలు లేవు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు.
నవంబర్ మూడో వారం వచ్చినా..
నవంబర్ మూడో వారం వచ్చినా.. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, యార్డుల్లో పనిచేస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న గ్రంథాలయాల్లో పనిచేస్తోన్న 2,500 మంది ఉద్యోగులకు జీతాలు పడలేదు.
ఇదే శాఖకు చెందిన 600 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అలాగే మార్కెటింగ్ శాఖకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఎఎంసీ), యార్డుల్లో పనిచేస్తున్న వారికి సైతం జీతాలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు.
అప్పులతో గ్రంథాలయ వారోత్సవాలు
ప్రతీ ఏటా నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల నిర్వహణ కోసం గ్రేడ్–1 గ్రంథాలయాలకు రూ.15వేలు, గ్రేడ్–2 గ్రంథాలయాలకు రూ.12వేలు, గ్రేడ్–3 గ్రంథాలయాలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేసేది.
అలాంటిది ఈ ఏడాది ఒక్కపైసా కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. సకాలంలో జీతాలు ఇవ్వకపోగా, వారోత్సవాలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రంథాలయాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా చేసేది లేక అప్పులు చేసి మరీ ఈ వారోత్సవాలను నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది.
తక్షణమే జీతాలు, పెన్షన్లు జమ చేయాలి
నవంబర్ 17వ తేదీ దాటుతున్నా రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అనారోగ్యంతో బాధపడే పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వేతనాలు, పెన్షన్లు విడుదల చేయాలి.– కళ్లేపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment