మందుబాబులకు చంద్రబాబు సర్కార్ ఝలక్
సరసమైన ధరలకే మద్యం సరఫరా అంటూ హామీ
ధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన వాగ్దానానికి తిలోదకాలు
నూతన మద్యం పాలసీలో పాత ధరలకే మద్యం విక్రయం
👉 ఉదయమంతా కష్టపడతారు. సాయంత్రమైతే ఒక పెగ్ వేసుకుని బాధలు మర్చిపోవాలనుకుంటారు. మీకు అండగా నేనుంటా. మేము అధికారంలోకి రాగానే మందు రేట్లు తగ్గిస్తాం. సరసమైన ధరలకే మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం’
– ఎన్నికల సమయంలో చంద్రబాబు మాటలు ఇవీ!
👉 మద్యం వ్యాపారం ప్రైవేటుగా నిర్వహిస్తాం. మందుబాబులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకువస్తాం. లైసెన్స్‌దారులు ఆర్డర్లు పెట్టిన రకాలనే సరఫరా చేస్తాం. రూ.99కే క్వార్టర్ మద్యాన్ని విక్రయిస్తాం’ ఇదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల మాట.
సాక్షి, నంద్యాల: చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చారు. సరసమైన ధరలకే మద్యాన్ని సరఫరా చేస్తామని, మందుబాబులంతా సంతోషంగా ఉండాలని ఊరువాడా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో రేట్లను చూసి మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత బ్రాండ్లు, పాత ధరలనే చూసి అవాక్కవుతున్నారు.
రూ.99కే క్వార్టర్ మద్యం ఎక్కడ
జిల్లాలో బుధవారం నుంచి నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు దుకాణాదారులు షాపులను ఏర్పాటు చేశారు. 14వ తేదీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొని లైసెన్స్‌లు దక్కించుకున్న వారిలో మొదటి రోజు 65 మంది వరకు దుకాణాలను ప్రారంభించారు. వీరికి ఏపీఎస్‌బీసీఎల్ మద్యాన్ని సరఫరా చేయనుంది. అయితే లిక్కర్ డిపోకు వెళ్లిన వారు అక్కడి రేట్లను చూసి షాక్‌కు గురయ్యారు.
గత ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన బ్రాండ్లే ఉన్నాయి. ధరల్లో కూడా ఏ మాత్రం మార్పు లేదు. ఇదేంటి ప్రభుత్వం మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పింది కదా అని దుకాణాదారులు అధికారులను ప్రశి్నస్తే.. ఏమో మాకేం తెలియదు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యాన్ని విక్రయిస్తాం. మీకు ఏ బ్రాండ్లు కావాలో చెప్తే వాటినే ఇస్తాం అంటూ చెప్పడంతో దుకాణాదారులు విస్మయానికి గురయ్యారు. మరోవైపు రూ.99కే క్వార్టర్ మద్యం వస్తుందని ఎదురుచూసిన మందుబాబుల ఆశలు అడియాసలయ్యాయి. రూ.99కే క్వార్టర్ సీసాలు ప్రస్తుతానికి జిల్లాకు రాలేదు. ఎప్పుడు వస్తాయో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. దీంతో పాత బ్రాండ్లు.. పాత ధరలతోనే విక్రయాలు జరగనున్నాయి.
మూతపడిన ప్రభుత్వ దుకాణాలు
కొత్త మద్యం విధానం అమలుల్లోకి రావడంతో ప్రభుత్వ మద్య దుకాణాలను పూర్తిగా మూసేశారు. జిల్లా వ్యాప్తంగా 93 మద్యం దుకాణాలు, 1 లిక్కర్ మార్ట్ ఉండేవి. వీటిని మంగళవారం రాత్రి 9 గంటలకు మూసేశారు. వీటి స్థానంలో 105 మద్యం దుకాణాలకు ప్రభుత్వం కొత్తగా లైసెన్స్‌లు జారీ చేసింది. తొలి రోజు నంద్యాల లిక్కర్ డిపో నుంచి సుమారు రూ.6.58 కోట్ల విలువ చేసే మద్యాన్ని దుకాణాదారులు కొనుగోలు చేశారు.
2 శాతం డ్రగ్ కంట్రోల్ సెస్
షాపులు దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్స్ రుసుములో ఆరో వంతు మొత్తాన్ని చెల్లించారు. దీంతో దుకాణాదారులకు తాత్కాలిక లైసెన్స్ జారీ చేశారు. ఇది ఈనెల 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తి స్థాయి లైసెన్స్ ఇస్తారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకాన్ని విధించింది. ల్యాండెడ్ కాస్ట్‌పై 2 శాతం మేర పన్ను వేయనుంది.
కూటమిలో ‘దుకాణం’ చిచ్చు!
ఆళ్లగడ్డ: బ్రాందీ షాపుల నిర్వహణ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇరిగెల, భూమా వర్గాలకు చెందిన నాయకులు షాపుల నిర్వహణకు సంబంధించి అవసరమైన స్థలాల కోసం యజమానులను బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఉద్రిక్తతకు దారి తీస్తోంది. శిరివెళ్ల మండలంలో మొత్తం నాలుగు బ్రాందీ షాపులకు లాటరీ వేయగా అందులో ఇరిగెల వర్గానికి 2, టీడీపీ వర్గానికి 1, ఇతరులకు 1 షాపు వచ్చింది. ఇరిగెల వర్గానికి చెందిన వారు శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో దుకాణం ప్రారంభించాలని ఎర్రగుంట్ల – వంకినిదిన్నె రహదారిలో ఖాళీగా ఉన్న స్థలాన్ని యజమాని∙దగ్గర లీజుకు తీసుకున్నారు.
ఇందుకు గాను రూ. 15 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే అదే స్థలంలో దుకాణం పెట్టాలని టీటీపీ నాయకుడు ఆ స్థల యజమానిని బలవంతంగా టీడీపీ నియోజకవర్గ నేత దగ్గరకు తీసుకు పోయాడు. అక్కడ ముందుగా అగ్రిమెంట్ రాసిచ్చిన తేదీ కంటే మరో రెండు రోజులు ముందుగానే టీడీపీ నేతలకు రాసిచ్చినట్లు అగ్రిమెంటు రాయించి సంతకాలు పెట్టించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరిగెల వర్గం వారు అక్కడ దుకాణం వేసే ప్రయత్నం చేయగా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివాదం పెద్దదై శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని అక్కడ ఎవరూ షాపు ఏర్పాటు చేయకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
వైన్ షాపు నిర్వాహకులకు ఎమ్మెల్యే బుడ్డా బెదిరింపులు
బండిఆత్మకూరు మండలంలోని సంతజూటూరు వైన్ షాప్ (నెంబర్.16) ఈర్నపాడుకు చెందిన పిట్టం రాజశేఖర్ రెడ్డికి దక్కింది. దీంతో ఆయన నిబంధనల మేరకు లైసెన్స్ ఫీజులో ఆరో వంతు కట్టేసి తాత్కాలిక లైసెన్స్ తెచ్చుకున్నారు. బుధవారం స్థానికంగా దుకాణం కోసం ఒక అద్దె భవనాన్ని ఎంచుకుని యజమానితో మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ యజమానిని స్టేషన్‌కు పిలిపించి దుకాణానికి అద్దెకు ఎందుకు ఇచ్చావ్.. అద్దెకు ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతోనే ఎస్‌ఐ ఈ విధంగా మాట్లాడినట్లు టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఎస్‌ఐ బెదిరింపులతో భవనాన్ని అద్దెకు ఇవ్వడానికి యజమాని ముందుకు రాకపోవడంతో నిర్వాహకులు మరో షాపును తీసుకుని సాయంత్రం ఓపెన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బుడ్డా నేరుగా రంగంలోకి దిగి నిర్వాహకులు తనతో మాట్లాడిన తర్వాతే షాపును ప్రారంభించాలని లేకుంటే నీ దుకాణమే ఉండదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులే ఇలా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడితే వ్యాపారం ఎలా చేసుకోవాలో అర్థంకావడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment