పోలవరం కాలువ గట్లను యథేచ్ఛగా తవ్వేస్తున్న కూటమి నేతలు
ద్వారకా తిరుమల, ఉంగుటూరు మండలాల్లో అడ్డగోలుగా తవ్వకాలు
మట్టి రవాణా కోసం సొంతంగా రోడ్డు నిర్మాణం
వందలాది టిప్పర్లలో మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో కూటమి నేతలు పోలవరం కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు యంత్రాలతో కాలువ గట్లను తవ్వి మట్టి తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ద్వారకా తిరుమల, ఉంగుటూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాలువ గట్లను సగానికి పైగా తవ్వేశారు. అవసరమైతే మట్టి తరలించడానికి సొంతంగా రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినా ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కాలువ వైపు కన్నెత్తి చూడటం లేదు.
అడ్డగోలు తవ్వకాలు ఇలా...
ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం, గుళ్లపాడులో టీడీపీ నాయకులు భారీగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఎం. నాగు లపల్లిలో పోలవరం కుడి కాలువ గట్టును దాదాపు సగం తవ్వేశారు. దీంతో కాలువ పటిష్టతపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో వారం రోజులుగా తవ్వకాలు ఆపారు.
గుళ్లపాడులో మాత్రం యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజూ 100 నుంచి 130 వరకు టిప్పర్లు, 50కి పైగా ట్రాక్టర్లలో ఏలూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారు. ఉంగుటూరు మండలం కంసాలిగుంటలో పోలవరం ఎడమ గట్టును తవ్వి మట్టిని తరలించేందుకు జనసేన నాయకుడు ఏకంగా రోడ్డు నిర్మించాడు.
రూ.కోట్లలో ఆదాయం
ప్రభుత్వం అనుమతి పొందిన చోట మట్టి తవ్వకాల కోసం ఒక క్యూబిక్ మీటర్‌కు మైనింగ్ శాఖకు రూ.120, ఇరిగేషన్ శాఖకు రూ.110 చొప్పున మొత్తం రూ.230 చెల్లించాలి. టిప్పర్‌కు 18 క్యూబిక్ మీటర్ల వరకు మట్టి లోడ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన క్యూబిక్ మీటరుకు రూ.230 చొప్పున ఒక లారీకి రూ.4,140 ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ పైసా ఫీజు చెల్లించకుండానే అక్రమంగా పోలవరం కాలువ గట్లు తవ్వి వందలాది టిప్పర్లలో రోజూ మట్టిని తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment