AP: 10 నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు | Sankranti Holidays To High Court From 10th January In AP | Sakshi
Sakshi News home page

AP: 10 నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు

Published Sat, Jan 8 2022 8:17 AM | Last Updated on Sat, Jan 8 2022 9:04 AM

Sankranti Holidays To High Court From 10th January In AP - Sakshi

సాక్షి, అమరావతి:  ఏపీ హైకోర్టుకు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. హైకోర్టు క్యాలెండర్‌ ప్రకారం 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ. ఈ మూడు రోజుల్లో హైకోర్టులో ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. 16న ఆదివారం. 17వ తేదీ నుంచి హైకోర్టు తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి.

ఈ వెకేషన్‌ కోర్టుల్లో న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఉంటారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ మన్మధరావు ద్విసభ్య ధర్మాసనంలో, జస్టిస్‌ సురేశ్‌రెడ్డి సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. అత్యవసర కేసులను ఈ నెల 10న పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఆ పిటిషన్లపై న్యాయమూర్తులు 12న విచారణ జరుపుతారు. హెబియస్‌ కార్పస్, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, మెజిస్ట్రేట్లు, సెషన్స్‌ జడ్జిలు తిరస్కరించిన బెయిల్‌ పిటిషన్లతో పాటు సెలవులు ముగిసేంత వరకు వేచిచూడలేనంత అత్యవసరం ఉన్న వ్యాజ్యాలను మాత్రమే వెకేషన్‌ కోర్టులు విచారిస్తాయి. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ రవీంద్రబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement