అక్కల మంగయ్య (ఫైల్)
తెనాలి: శిల్పకళలో తెనాలి కళా నైపుణ్యాన్ని ఖండాంతరాలకు చాటిన అక్కల సోదరుల్లో పెద్దవాడైన అక్కల మంగయ్య(82) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మంగయ్య భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. 1939లో జన్మించిన మంగయ్య ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివి, తండ్రి రామయ్య స్థాపించిన శిల్పశాలలో శిల్ప విద్యనభ్యసించారు. తండ్రికి చేదోడుగా ఉంటూనే తన ఊహాశక్తిని జోడించి శిల్పకళలో నైపుణ్యాన్ని సాధించారు. వేంకటేశ్వరస్వామి విగ్రహాల తయారీలో జాతీయస్థాయి ఖ్యాతినార్జించారు. అందివచ్చిన ముగ్గురు సోదరులతో కలిసి దేశంలోని వివిధ నగరాలకు శ్రీవారి విగ్రహాలను తయారుచేసి ఇచ్చారు.
అమెరికాలోని మిసిసిపి, టెక్సాస్, కాలిఫోర్నియా, లివర్‌మోర్ సిటీ, ఆఫ్రికా, మారిషస్ దేశాల్లోని తెలుగువారి ఆలయాలకు వేంకటేశ్వరుడు, ఇతర దేవతా విగ్రహాలు, సర్వాంగ ఆభరణాలు, మకరతోరణాలను చేసి ఇచ్చారు. శ్రీవారికి టీటీడీ రూ.3.50 కోట్లతో చేయించిన వజ్రకిరీటం నమూనాతో అమెరికాలోని ఆలయం కోసం నవరత్న ఖచిత కిరీటాన్ని తీర్చిదిద్దిన ఆయన ప్రతిభకు భక్తులు నీరాజనాలర్పించారు. వీటితోపాటు దేశనాయకులు, రాజకీయ ప్రముఖుల కాంస్య, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్ విగ్రహాల తయారీలోనూ సిద్ధహస్తులుగా పేరుగడించారు. నాటి ముఖ్యమంత్రులు టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మచే మంగయ్య సత్కారం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment