జూలై 1న లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి
ఒక్కరోజులోనే 65,18,496 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు
పెంచిన మేరకు మొత్తం పింఛన్ల మొత్తం రూ.4,399.89 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 నుండి పంపిణీ చేయాలి
ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్లు.. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగులూ వినియోగం
29నే బ్యాంకుల నుండి నగదు డ్రా చేసుకుని పంపిణీకి సిద్ధం కావాలి
సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశం
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలులో భాగంగా కొత్త ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్దిదారుల ఇంటి వద్దే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 65,18,496 మందికి పెంచిన మొత్తాన్ని ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు.
ఆయన మాట్లాడుతూ..
ఎన్నికల సమయంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి ఇచ్చి న హామీ మేరకు ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1న రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే జూన్‌కు సంబంధించిన ఎరియర్ల సొమ్ము నెలకు రూ.వెయ్యి చొప్పున మూడునెలల ఎరియర్స్ మూడువేలతో కలిపి మొత్తం రూ.7,000లను పంపిణీ చేయాలని సీఎస్ ఆదేశించారు.
రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు, నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్‌ఝకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన పింఛను సొమ్మును పంపిణీ చేయాలని ఆయన సూచించారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలోలాగే ఎలాంటి మార్పులేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలన్నారు.
1వ తేదీనే పంపిణీ
ఇక పెంచిన పింఛన్లను జూలై 1న రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది పింఛనుదారులకు ఒక్కరోజులోనే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని నీరబ్‌కుమార్ చెప్పారు. ఇందులో రూ.4,369.82 కోట్లను 64.75 లక్షల మంది పింఛనర్ల ఇళ్ల వద్ద, మిగిలిన సొమ్ము రూ.30.05 కోట్లను రాష్ట్రం వెలుపల ఉండే 0.43 లక్షల పింఛనర్లు.. బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును శనివారమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జూలై 1న ఉ.6.00 గంటల నుండి పింఛనర్ల ఇంటివద్దే పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలనూ వినియోగించుకోవాలని సీఎస్ చెప్పారు. అలాగే, ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున అప్పగించేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారంకల్లా పూర్తిచేయాలన్నారు.
సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని.. అవసరమైతే రెండోరోజు కొనసాగించాలన్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డి్రస్టిబ్యూషన్ సరి్టఫికెట్ కూడా జారీచేయాలని నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శులు సౌరబ్ గౌర్, సత్యనారాయణ.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment