
తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమలలో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. గోగర్భం డ్యామ్ చెంత ఉన్న ఉద్యానవనంలో కాళీయమర్దనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిõÙకాలు చేసి ఉట్లోత్సవం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ చేపట్టారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8–10 గంటల నడుమ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహించారు. ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానాన్ని ఘనంగా చేపట్టారు.
కాగా, శుక్రవారం తిరుమలలో సాయంత్రం ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీన్ని బంగారు తిరుచ్చిపై మలయప్పస్వామివారు, మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ తిలకించనున్నారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, ఒడిశా గవర్నర్ గణేషీ లాల్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలను, అధికారులు ప్రసాదాలను అందజేశారు. కాగా, గోవిందకోటి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. చిన్నారులు, యువతలో సనాతన ధర్మం, మానవీయ విలువలు, మానవ సంబంధాల గురించి అవగాహన, ఆసక్తి పెంచడానికి టీటీడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గురువారం గోవింద కోటి రాయడాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment