ఎన్టీఆర్ జిల్లాలో నలుగురు దుర్మరణం
నంద్యాల జిల్లాలో ఒకరు.. కాకినాడ జిల్లాలో మరొకరు మృతి
మూడుచోట్లా 85 మందికి పైగా బాధితులు
జగ్గయ్యపేట/జూపాడుబంగ్లా/సామర్లకోట: రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో డయేరియా బారినపడి నలుగురు, నంద్యాల జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. మూడు జిల్లాల్లోనూ 85 మందికి పైగా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉంటున్న ఉమ్యినేని రంగయ్య (60), జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన తురక మంగతాయారు (55), బూదవాడ గ్రామానికి చెందిన గుగులోతు జమ్మా (60), వేదాద్రి గ్రామానికి చెందిన పసుమర్తి సత్యవతి (75) వాంతులు, విరోచనాలతో జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 19 మంది డయేరియా బాధితులకు వైద్యసిబ్బంది చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.
నంద్యాల జిల్లాలో..
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు శివారు చాబోలులో శుక్రవారం 30 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది నందికొట్కూరు, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం మరో నలుగురు వాంతులు, విరేచనాలతో నీరసించిపోయారు. వారిలో నడిపి నాగన్న (45) అనే వ్యక్తిని నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.
డయేరియా బాధితుల్లో రంగమ్మ, మరియమ్మ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని తాగునీటి ట్యాంకులో కొంగపడి చనిపోయి దుర్వాసన వస్తున్నా సిబ్బంది పట్టించుకోలేదని, అందువల్లే డయేరియా ప్రబలిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసినా, సరైన చికిత్స అందించకపోవటం వల్లే తన అన్న నాగన్న చనిపోయాడని ఆయన తమ్ముడు చిన్ననాగన్న కన్నీటి పర్యంతమయ్యారు.
అదనపు జిల్లా వైద్యాధికారిణి శారదాబాయి మాత్రం నడిపినాగన్నకు చికిత్స అందించామని, ఆయన డయేరియాతో కాకుండా గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామని తెలిపారు. మరోవైపు నడిపినాగన్న మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని జూపాడుబంగ్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేజే రోడ్డు పక్కన మృతదేహంతో ప్రజాసంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేíÙయో చెల్లించాలని డిమాండ్ చేశారు.
వేట్లపాలెంలో మహిళ మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో డయేరియా వ్యాపించింది. గ్రామంలో ఈ నెల 19న డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు పెరిగింది. ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వీరిలో కొమ్మోజు సత్యవేణి (42) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాకినాడ ఆర్‌డీవో ఇట్ల కిషోర్, డీఎంహెచ్‌వో జె.నరసింహ నాయక్, డీపీవో సౌజన్య శనివారం వేట్లపాలెంలో పర్యటించారు. జొన్నలదొడ్డి, వేట్లపాలెం పీహెచ్‌సీలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment