సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్–2021’లో ఏపీ.. దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్’ స్కోచ్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ ఎండీ దీపక్ దలాల్ ప్రకటించారు.
జూన్ 18న ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన తెలిపారు. స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడంపట్ల డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ అరుదైన గుర్తింపు లభించిందన్నారు. గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లడం వంటి అంశాలతో గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే ఈ స్కోచ్ అవార్డని అన్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.
గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ పురస్కారం
Published Fri, May 27 2022 5:05 AM | Last Updated on Fri, May 27 2022 8:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment