
చైర్‌పర్సన్ లేకుండానే నర్సీపట్నం కౌన్సిల్ సమావేశం
నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించిన స్పీకర్ అయ్యన్న
బడ్జెట్ ఆమోదించాలని అధికారులకు ఆదేశం
తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెప్పినా చైర్‌పర్సన్ రాలేదని మండిపాటు
చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని హుకుం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న స్థానిక సంస్థలపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోంది. తాజాగా దళిత మహిళ అయిన నర్సీపట్నం చైర్‌పర్సన్‌ను అవమానించింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా నిబంధనలు ఉల్లంఘించి మరీ నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఇద్దరూ అధ్యక్షత వహించకుండా స్థానిక ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని.. అందులోనూ బడ్జెట్ సమావేశాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించింది.
పైగా, అయ్యన్నపాత్రుడు కౌన్సిల్‌లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా మంగళవారమే ప్రమాణ స్వీకారం చేయడం, అధ్యక్ష స్థానంలో ఎవరూ లేకపోయినప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోనే సమావేశాన్ని నిర్వహించడం, బడ్జెట్ ఆమోదించాలని ఆయనే ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ నియమించిన దళిత మహిళ సుబ్బలక్షిని అవమానపరిచేలా అయ్యన్న వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘన!
ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీ చట్టం–1965లోని సెక్షన్ 47 (బి), సెక్సన్ 51, సెక్షన్ 51 (1) బి, సెక్షన్ 50 (3) ప్రకారం.. మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించాలి. ఒకవేళ చైర్‌పర్సన్ అందుబాటులో లేకపోతే వైస్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో జరగాలి. ఇద్దరూ అందుబాటులోకి లేకుండా, మెజార్టీ సభ్యులు హాజరై కోరం ఉంటే.. ఆ సభ్యుల్లో నుంచి ఒకరిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుని, వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలి. అయితే, మంగళవారం జరిగిన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చైర్‌పర్సన్, దళిత మహిళ అయిన సుబ్బలక్ష్మి హాజరు కాలేదు.
మాజీ ప్రధాని మన్మోహనసింగ్ మృతికి సంతాప దినాలైనందున సమావేశాన్ని వాయిదా వేయాలని ఆమె అధికారులను కోరారు. అయినా సమావేశాన్ని నిర్వహించారు. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ సమావేశంలో లేరు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనే కౌన్సిల్ హాలులో సమావేశాన్ని నిర్వహించారు. కనీసం సభ్యుల నుంచి తాత్కాలిక అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేదు. నిబంధనలను విరుద్ధంగా సమావేశం జరుగుతున్నప్పటికీ అధికారులెవ్వరూ అడ్డుచెప్పలేదు. అంతేకాకుండా ఏకంగా బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయాలని ఆదేశించారు. పైగా స్పీకరు స్థానంలో ఉన్న తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెబితే... గైర్హాజరైన చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా అధికారులను అయ్యన్న పాత్రుడు ఆదేశించడం గమనార్హం.
స్థానిక సంస్థలపై కూటమి పెత్తనం
వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థలపై పెత్తనం చలాయిస్తోంది. ఇటీవల వైఎస్సార్ జిల్లా కడప మునిసిపల్ సమావేశంలో సీటు కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఏకంగా మేయర్‌పైనే దాడి చేసినంత పని చేశారు. ఇప్పుడు నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కూడా అయిన అయ్యన్నపాత్రుడే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం మరిన్ని విమర్శలకు దారితీసింది.
వద్దని చెప్పినప్పటికీ.. కావాలనే సమావేశం పెట్టారు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా సమావేశం వాయిదా వేయాలని చెప్పాను. అయినా కావాలనే సమావేశం పెట్టారు. మన్మోహన్‌సింగ్ సంతాప దినాలు ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడే చెప్పారు. మరోపక్క రాజ్యాంగ పదవిలో ఉండి మొదటిసారిగా మున్సిపల్ సమావేశానికి విచ్చేస్తున్న స్పీకర్‌కు సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సంతాప దినాల అనంతరం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరాను. అయినా ఉద్దేశపూర్వకంగా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయం చేశారు. – మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment