సాక్షి, అనకాపల్లి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో జిల్లా ప్రజలు నివసించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశించారు. రెండు నెలల్లో జిల్లాలో ఎక్కడా గంజాయి, నాటుసారా అనేది లేకుండా మూలాల్ని నాశనం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ క్రతువులో బాగా పనిచేసే సిబ్బందికి రివార్డులతో పాటు పని చెయ్యని వారిపై చర్యలూ ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ), జిల్లా పోలీసులతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్‌ఈబీ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా గంజాయి, నాటుసారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చేయాలని ఆదేశించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గ్రామాల్లో ముమ్మర దాడులు నిర్వహించి జిల్లా నుంచి సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వివిధ నేరాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అందులో గంజాయి, నాటుసారా కేసులలో ఉన్న పాత నేరస్తులపై బైండోవర్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. వారు మళ్లీ.. ఈ తరహా కేసుల్లో దొరికితే స్థానిక తహసీల్దార్ కోర్టులో నగదు పూచీతో జరిమానా కట్టించాలని, లేదంటే జైలు శిక్ష అనుభవిం చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాల్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలన్నారు.
నల్లబెల్లం ఎక్కడిది.?
నాటుసారా తయారీలో ప్రధాన ముడిపదార్థమైన నల్లబెల్లం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. గడిచిన రెండు వారాల్లో దాదాపు 50 వేల లీటర్లకు పైగా బెల్లం పులుపుని ధ్వంసం చేసినా.. ఇంకా పలు చోట్ల పట్టుబడుతుండటంపై ఎస్పీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ నల్లబెల్లం ఎక్కడి నుంచి వస్తోంది.? నాటుసారా తయారు చేస్తున్నవారు ఎలా కొనుగోలు చేస్తున్నారు.? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించి.. సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అనకాపల్లిలో ఉన్న బెల్లం వ్యాపారులతో ఎస్‌ఈబీ, స్థానిక పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేసి.. నల్లబెల్లం విక్రయాలపై నిఘా పటిష్టం చెయ్యాలని ఎస్పీ సూచించారు.
అధికారులకు రివార్డులు
జిల్లా నుంచి గంజాయి, నాటుసారా సమూల నిర్మూలనకు చేస్తున్న యుద్ధంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి కీలక భాగస్వామిగా మారాలని ఎస్పీ గౌతమి పిలుపునిచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు ఉంటాయని ప్రకటించారు. అదే సమయంలో అంచనాలకు తగ్గట్లుగా పనిచెయ్యని సిబ్బందిపై చర్యలు కూడా తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్) కె.శ్రావణి, నర్సీపట్నం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ మణికంఠ చందోలు, ఎస్‌ఈబీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్‌తోపాటు జిల్లా సీఐలు, ఎస్‌ఐలు, ఎస్‌ఈబీ ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.
గంజాయి రవాణాపై గట్టి నిఘా
గొలుగొండ: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వస్తున్న గంజాయిపై దృష్టి సారించాలని, గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశాలు జారీ చేశారు. ఆమె గురువారం రాత్రి ఏజెన్సీకి ముఖద్వారం అయిన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. తరువాత భీమవరం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. చింతపల్లి, జీకేవీధి నుంచి గంజాయి రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. ఆమె వెంట నర్సీపట్నం ఏఎస్పీ మణీకంఠ చందోల్, సీఐ స్వామినాయుడు, ఎస్‌ఐ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment