‘అన్నదాతా.. శుభోదయం!’ | Special radio station under the auspices of YSR Horticultural University | Sakshi
Sakshi News home page

‘అన్నదాతా.. శుభోదయం!’

Published Sun, Mar 14 2021 4:03 AM | Last Updated on Sun, Mar 14 2021 4:03 AM

Special radio station under the auspices of YSR Horticultural University - Sakshi

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం

సాక్షి, అమరావతి: ‘దేశానికి అన్నం పెట్టే అన్నదాతా.. మీకు శుభోదయం! పుడమి తల్లికి పచ్చని సింగారమద్దే ఓ కర్షక మిత్రా.. మీకు నవోదయం!’ అంటూ రైతులను పలకరించబోతోంది డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ‘ఉద్యాన వాణి’ రేడియో. అన్నదాతల కోసం దేశంలోనే ప్రయోగాత్మకంగా యూనివర్సిటీ ఓ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. 2 నెలలుగా ప్రయోగాత్మకంగా రైతు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న వర్సిటీ రేడియో స్టేషన్‌ త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది. రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం. యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనల ఫలితాలు, అభివృద్ధి చేసిన సాంకేతిక విధానాలతోపాటు ఆ«ధునిక సేద్య సమాచారాన్ని నేరుగా రైతులకు అందించనున్నారు. అలాగే వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ఉద్యాన కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు గ్రామీణ ఉద్యాన అభ్యాస పూర్వక కార్యక్రమాలను రేడియో పాఠాల ద్వారా అందిస్తారు. రోజుకు కనీసం 8 గంటల పాటు ప్రసారాలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులను ఇప్పటికే పొందింది. 

రూ.24 లక్షలతో ప్రత్యేక స్టూడియో
వర్సిటీ ప్రాంగణంలోనే రూ.24 లక్షలు వెచ్చించి స్టూడియోను నిర్మించారు. జనవరి నుంచి ప్రయోగాత్మకంగా ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు వివిధ ఉద్యాన పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతుల సందేహాలను నివృత్తి చేసేలా శాస్త్రవేత్తల సమన్వయంతో ప్రసారాలను రూపొందిస్తున్నారు. సులభంగా అర్థం చేసుకునే రీతిలో కథలు, కథానికలు నాటకాల రూపంలో రికార్డింగ్‌ చేసి ప్రసారం చేస్తుండటంతో రైతులతో పాటు విద్యార్థులు అభ్యసన పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. మంగళ, శుక్ర వారాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటల సాగు, పశు, మత్స్యపోషణ వంటి విషయాలపై వాతావరణ ఆధారిత సూచనలు, సలహాలు అందిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఉద్యాన వాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచే లక్ష్యంతో ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్‌ చేస్తున్నారు.  
స్టూడియోలో మాట్లాడుతున్న శాస్త్రవేత్త 

కేంద్రం అభినందనలు
రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు చొరవ చూపిన వైఎస్సార్‌ వర్సిటీని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఇదే తరహాలో ప్రత్యేక రేడియో స్టేషన్లు ఏర్పాటు చేయాలని దేశంలో అన్ని వర్సిటీలకు సూచించింది. ఇందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది.

దేశంలోనే తొలి ప్రయోగం
రేడియో స్టేషన్‌ ఏర్పాటుకు గ్రాంట్‌ ఆఫ్‌ ఆపరేటింగ్‌ లైసెన్స్‌ వచ్చింది. ఇప్పటికే యాంటెన్నా, ట్రాన్స్‌మిటర్‌తో పాటు  స్టూడియో కూడా సిద్ధం చేశాం. పూర్తి స్థాయి అనుమతులు రాగానే ఉద్యాన వాణి రేడియో ప్రసారాలను అధికారికంగా ప్రారంభిస్తాం. రేడియో ప్రసారాలను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేసి ఆర్‌బీకే చానల్‌తో పాటు ఆకాశవాణి, దూరదర్శన్‌కు కూడా అందించడం ద్వారా బహుళ ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.  
 – డాక్టర్‌ టి.జానకిరామ్, వైస్‌ చాన్స్‌లర్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement