Dr YSR Horticulture University
-
అరటికి అందలం..ఇయర్ ఆఫ్ బనానాగా ప్రకటన
తాడేపల్లిగూడెం: మూడేళ్ల నుంచి ఉద్యాన పంటల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఈ ఏడాదిని (2022–23) అరటి సంవత్సరం (ఇయర్ ఆఫ్ బనానా)గా ప్రకటించింది. ఈ మేరకు కరపత్రాలు, అధికారిక లోగోను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు కార్యరూపం ఇస్తూ విశేష కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోన్న ఉద్యాన వర్సిటీ ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల బలోపేతంలో క్రియాశీలక భూమిక పోషిస్తుంది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జానకీరాం వినూత్న ఆలోచనలతో 2020 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో పంటను ఎంచుకొని పంటల నామ సంవత్సరాన్ని ప్రకటిస్తున్నారు. 2022–23ని ఇయర్ ఆఫ్ బనానాగా ప్రకటించారు. ఎంపిక చేసిన పంటకు సంబంధించి ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన, రాష్ట్ర ప్రభుత్వ శాఖల, జాతీయ సంస్థల సమన్వయంతో, దేశంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో అత్యంత ప్రాధాన్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. రైతులు, ఉద్యాన శాఖ, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సంయుక్త కృషితో చేసిన కార్యక్రమాలు సామాన్య ప్రజలకు కూడా ఎంతో అవగాహన కలుగుతోంది. 2020–21ని అంబాజీపేట పరిశోధనస్థానం ద్వారా ఇయర్ ఆఫ్ కోకోనట్‌గా ప్రకటించారు. 2021–22ని పెట్లూరు నిమ్మ పరిశోధన స్థానం ద్వారా నిమ్మ, నారింజ, బత్తాయిల కోసం ఇయర్ ఆఫ్ సిట్రస్‌గా ప్రకటించారు. దేశంలో విశ్వవిద్యాలయాలకు ఈ పద్ధతి నమూనాగా మారింది. పరిశోధనల్లో వర్సిటీ మేటి మహారాష్ట్ర, గుజరాత్లో పండించే గ్రాండ్‌నెస్ (పెద్దపచ్చఅరటి)కు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇక్కడ పండించే కర్పూర, చక్కెరకేళీ, తెల్ల చక్కెరకేళీ, మార్టమస్, ఎర్ర చక్కెరకేళీ రకాలు దేశవాళీ రకాలుగా ప్రాచుర్యం పొందాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అరటి పరిశోధన స్థానం విడుదల చేసిన కొవ్వూరు బొంత, గోదావరి బొంత అరటి వంటి కూర రకాలు కూడా ఉన్నాయి. టిష్యూ కల్చర్, బిందుసేద్య పద్ధతుల ద్వారా అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అరటి విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. మూడు, నాలుగేళ్లుగా అరటి రైతులు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా గ్రాండ్‌నెస్ అరటి రకాన్ని సాగు చేస్తున్నారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో పనిచేస్తోన్న ఉద్యాన పరిశోధన స్థానం (కొవ్వూరు) కృషి ఫలితంగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. విత్తన, పిలక ఎంపిక, టిçష్యూకల్చర్ అరటి, సాగు, బిందు సేద్య విధానం, గెలల యాజమాన్యం, ఎరువులు, తెగుళ్ల యాజమాన్యం, కోత ముందు తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తలు వివరిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అరటిసాగు పెరగడం వల్ల కొత్త రకాలు, ఆయా ప్రాంతాలకు అనువైన సేద్య పద్ధతులను అందుబాటులోకి తెస్తున్నారు. 2019లో ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కొత్తగా 70 ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేసింది. -
‘అన్నదాతా.. శుభోదయం!’
సాక్షి, అమరావతి: ‘దేశానికి అన్నం పెట్టే అన్నదాతా.. మీకు శుభోదయం! పుడమి తల్లికి పచ్చని సింగారమద్దే ఓ కర్షక మిత్రా.. మీకు నవోదయం!’ అంటూ రైతులను పలకరించబోతోంది డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ‘ఉద్యాన వాణి’ రేడియో. అన్నదాతల కోసం దేశంలోనే ప్రయోగాత్మకంగా యూనివర్సిటీ ఓ ఎఫ్ఎం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. 2 నెలలుగా ప్రయోగాత్మకంగా రైతు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న వర్సిటీ రేడియో స్టేషన్ త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది. రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్ నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం. యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనల ఫలితాలు, అభివృద్ధి చేసిన సాంకేతిక విధానాలతోపాటు ఆ«ధునిక సేద్య సమాచారాన్ని నేరుగా రైతులకు అందించనున్నారు. అలాగే వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ఉద్యాన కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు గ్రామీణ ఉద్యాన అభ్యాస పూర్వక కార్యక్రమాలను రేడియో పాఠాల ద్వారా అందిస్తారు. రోజుకు కనీసం 8 గంటల పాటు ప్రసారాలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులను ఇప్పటికే పొందింది. రూ.24 లక్షలతో ప్రత్యేక స్టూడియో వర్సిటీ ప్రాంగణంలోనే రూ.24 లక్షలు వెచ్చించి స్టూడియోను నిర్మించారు. జనవరి నుంచి ప్రయోగాత్మకంగా ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు వివిధ ఉద్యాన పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతుల సందేహాలను నివృత్తి చేసేలా శాస్త్రవేత్తల సమన్వయంతో ప్రసారాలను రూపొందిస్తున్నారు. సులభంగా అర్థం చేసుకునే రీతిలో కథలు, కథానికలు నాటకాల రూపంలో రికార్డింగ్ చేసి ప్రసారం చేస్తుండటంతో రైతులతో పాటు విద్యార్థులు అభ్యసన పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. మంగళ, శుక్ర వారాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటల సాగు, పశు, మత్స్యపోషణ వంటి విషయాలపై వాతావరణ ఆధారిత సూచనలు, సలహాలు అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉద్యాన వాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచే లక్ష్యంతో ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. స్టూడియోలో మాట్లాడుతున్న శాస్త్రవేత్త కేంద్రం అభినందనలు రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు చొరవ చూపిన వైఎస్సార్ వర్సిటీని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఇదే తరహాలో ప్రత్యేక రేడియో స్టేషన్లు ఏర్పాటు చేయాలని దేశంలో అన్ని వర్సిటీలకు సూచించింది. ఇందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. దేశంలోనే తొలి ప్రయోగం రేడియో స్టేషన్ ఏర్పాటుకు గ్రాంట్ ఆఫ్ ఆపరేటింగ్ లైసెన్స్ వచ్చింది. ఇప్పటికే యాంటెన్నా, ట్రాన్స్‌మిటర్‌తో పాటు స్టూడియో కూడా సిద్ధం చేశాం. పూర్తి స్థాయి అనుమతులు రాగానే ఉద్యాన వాణి రేడియో ప్రసారాలను అధికారికంగా ప్రారంభిస్తాం. రేడియో ప్రసారాలను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసి ఆర్బీకే చానల్‌తో పాటు ఆకాశవాణి, దూరదర్శన్‌కు కూడా అందించడం ద్వారా బహుళ ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్స్‌లర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం -
ఉద్యాన పంటల సాగులో మెలకువలు
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావ పరిస్థితులు జిల్లాలో ఉద్యాన పంటలను దెబ్బతీస్తున్నాయి. వాతావరణ మార్పులతో చీడపీడల ఉద్ధృతి ఎక్కువ కనిపిస్తోంది. ఆగస్టు నెలలో ఈ పంటలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ.. వెంకట్రామన్న గూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం శాస్త్రవేత్తలు ప్రత్యేక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక వివరాలను ఉద్యాన శాఖ కర్నూలు-1 ఏడీ సాజా నాయక్(8374449061) సాక్షికి తెలిపారు. వీటిని పాటిస్తే చీడ పీడలను సమర్థంగా నివారించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ఉల్లి, టమాట.. ఇతర కూరగాయల పంటలు వర్షాభావంతో బెట్టకు గురవుతున్నాయి. బెట్టను తట్టుకునేందుకు యూరియా లేదా డీఏపీ లేదా 19.19.19 లేదా 17.17.17 ఎరువును లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. మామిడి పూత బాగా రావాలంటే ఈ నెలలో చెట్లకు నీరు పెట్టాలి. ఎండు కొమ్మలు ఉంటే వాటిని తీసివేసి బోరోపేస్ట్ మందును పూస్తే ఎండు కిందకు దిగదు. అరటి తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. ఆకు మచ్చ తెగులు గమనించినట్లయితే ప్రొపికొనజోల్ లీటరు నీటికి 1 ఎంఎల్, 0.5 ఎంఎల్ జిగురును కలిపి 20 రోజుల వ్యవధిలో 2 నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. తెల్ల చక్కరకేళి రకానికి రెండో దఫా ఎరువులు వేయాలి. జిల్లాలో క్రిష్ణగిరి, తుగ్గలి, డోన్ ప్రాంతాల్లో నిమ్మ తోటలు అధికంగా ఉన్నాయి. వీటిలో అంతర పంటలుగా అలసంద, గోరు చిక్కుడు, మినుములు, పెసర వేసుకోవచ్చు. తోటల్లో ఎండు మొక్కలను కత్తరించి ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లేత ఆకులపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లను 50 శాతం పూత దశలో భూమిలో కలియదున్నాలి. గానోడెర్మా తెగులు నివారణకు 2 ఎంఎల్ ట్రైడిమార్ఫ్ మందును ఒక లీటరు నీటికి కలిపి పాదులను తడపాలి. బంక తెగులు నివారణకు ఒక గ్రాము కార్బన్‌డజిమ్ మందును లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. సపోటలో ఆకు గూడు, మొగ్గ తొలిచే, గింజ తొలిచే పురుగులు ఉన్నాయి. వీటి నివారణకు 2.5 ఎంఎల్ క్లోరోఫైరిపాస్ లేదా 2 ఎంఎల్ మోనోక్రోటోపాస్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దానిమ్మ తోటల్లో అంతర కృషి చేయాలి. చెట్ల పాదుల్లో తవ్వకం చేసి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.