పుస్తకం తీస్తే కళ్లు మూసుకుపోతున్నాయి.. ఓ టీ పడితే అంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే బద్దకం వీడడం లేదు. కడుపు టీ కోరుతోంది మరి. శీతాకాలపు వేకువలకు టీ జత కలిస్తే ఆ మ్యాజిక్కే వేరు. చలిగాలులు వీస్తున్న సాయంత్రం పూట టీ కప్పు చేసే మాయాజాలం ఆస్వాదిస్తే గానీ అర్థం కాదు. అందుకే టీ తిరుగులేనిది. శ్రీమంతుడి ఇంటిలో వెండి కప్పులో తాగినా, పేదవాడు గ్లాసులో పోసి ఇచ్చినా రుచి మాత్రం అమోఘమే. ఫైవ్ స్టార్ హొటల్ అయినా, రోడ్డు పక్క బడ్డీ కొట్టు అయినా దాని ‘టీ’వే వేరు. అందుకే టీ అందరికీ ఇష్టమైనది. చక్కెర ఒంటికి పడదు, అల్లం వేసుకో.. పాలు అంతగా నచ్చవు.. లెమన్ టీ మీ కోసమే. గొంతు బాగోలేదా.. పెప్పర్ టీ రెడీ.. ఒకటి నచ్చకపోతే పది వెరై‘టీ’లు ఉన్నాయి. అందుకే టీ ఎదురులేనిది.
– శ్రీకాకుళం రూరల్, ఇచ్ఛాపురం రూరల్, రాజాం
ఎందరికో ఉపాధి..
జిల్లాలో టీ షాపుల సంఖ్య ఎంతో తెలుసా..? దాదాపు 3600. అంటే ఇన్ని వేల కుటుంబాలకు టీ ఆధారంగా నిలుస్తోంది. వెనుకబడిన జిల్లాగా ముద్ర పడిన సిక్కోలులో చాలా గ్రామాల్లో కుటుంబాలు ఈ టీ షాపులపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడంటే ఇంట్లో టీ చేసుకోవడం అలవాటైంది గానీ.. ఒకప్పుడు ఊళ్లలో టీ షాపుల ముందు పొద్దున్నే గ్లాసులు పట్టుకుని పార్సిల్ కోసం గంటల తరబడి వేచి ఉండేవారు. రానురాను షాపుల నుంచి టీ ఇంటికి తీసుకెళ్లే అలవాటు మారిపోయినా.. ఆఫీసులు, దుకాణాలకు పట్టుకువెళ్లే కొత్త పద్ధతి మొదలైంది. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు, పరిశ్రమలు, షాపింగ్ మాళ్లు కొత్తగా ఏర్పాటు కావడంతో అక్కడకే టీ తీసుకువెళ్లి విక్రయించే పద్ధతులు చాలా మందికి లాభిస్తున్నాయి.
ఆహా ఏమి రుచి..
మారుతున్న కాలంతో పాటు టీ రుచుల్లో కూ డా తేడాలు వస్తున్నాయి. ఒకప్పుడు చాలా కొద్ది రకాల టీలు మాత్రమే లభించేవి. కానీ యువత కూడా ఈ టీ బిజినెస్‌లోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా దీని రూపురేఖలు మారిపోయాయి. అల్లం టీ, లెమన్ టీ, పెప్పర్ టీ, బాదం టీ అంటూ ఊరూరా కొత్త కొత్త షాపులు పుట్టుకువచ్చాయి. సంప్రదాయ టీ దుకాణాల్లో మాత్రం అలవాటైన టీ ఘుమఘుమలు అలాగే ఉన్నాయి. వయసులో పెద్ద వారు తమకు అలవాటైన దుకాణాల్లో టీలను ఆస్వాదిస్తుంటే.. యువత మాత్రం కొత్తగా ఏర్పాటైన షాపుల్లో విభిన్న రుచులను టేస్ట్ చేయడానికి ఇష్ట పడుతున్నారు.
ఆరోగ్య ప్రదాయిని..
ఓ పద్ధతి ప్రకారం తాగితే టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాయ్ తాగడం ద్వారా మానసిక ఉత్తేజం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు చాలా బాగా పనిచేస్తాయి. గ్రీన్, లెమన్, హీనీ, బ్లాక్, అల్లం, బెల్లం, మసాలా, బాదం టీలు ఈ ఆరోగ్య ప్రదా యిని జాబితాలో అగ్రశ్రేణిలో ఉంటాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనల ద్వారా తెలిసింది.
టీకీ ఓ టైముంది..
రోజూ ఉదయాన్నే పరగడుపున కొందరు టీ తాగుతుంటారు. కానీ అది మంచిది కాదని వైద్యుల సూచన. టీలో ఎన్నో ఆల్కలాయిడ్స్ ఉంటా యి. వాటిలో చాలా వరకు ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పరగడుపున టీ తాగడం అసిడిటీని పెంచుతుంది. భోజనానికి ముందుగా టీ తాగడం కూడా సరైన పద్ధతి కాదు. టీ ఆకలిని చంపేస్తుంది. భోజనం తర్వాత కూడా కనీసం 45 నిమిషాలు మొదలుకొని గంట వరకు టీ తాగడం సరికాదు. వెంటనే తాగితే జీర్ణమైన భోజనంలోని శక్తి ఒంటికి పట్టదు. టీతో ట్యాబ్లెట్ కూడా వేసుకోవడం శ్రేయస్కరం కాదంటున్నారు వైద్యులు. అందుకే టీ తాగే వేళలను నిర్దిష్టంగా చూసుకుంటే రుచిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు.
పెరిగిన ధరలు..
‘టీ’ ధర చాలా ఏళ్లుగా పేద ప్రజలకు అందుబాటులోనే ఉంది. ఇప్పుడిప్పుడు మాత్రం ధరలు పెరుగుతున్నాయి. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. ప్రస్తుతం చాయ్ రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముతున్నారు. టీ ధరలు పెరిగినా ఆదరణ మాత్రం తగ్గలేదు. కూలీనాలీ చేసే సామాన్యులు సైతం దినచర్యను చాయ్‌తోనే మొదలుపెడతారు. చాయ్ తయారు చేయడానికి అవసరమయ్యే అన్ని రకాల వస్తు వుల ధరలు పెరగడం వల్ల ఇప్పుడు చాయ్ ధరలను పెంచాల్సి వస్తుందని టీ æకొట్టు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.
అర్ధ రూపాయి నుంచి అమ్ముతున్నా..
నేను ఐదేళ్ల ప్రాయం నుంచి టీ చేయ డం నేర్చుకున్నాను. 30 ఏళ్ల నుంచి టీ కొట్టును పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ప్రస్తుతం ఇదే వృత్తి మాకు జీవనోపాధి. అర్ధ రూపాయి నుంచి టీ నేటికి ఐదు రూపాయల వరకు పెరిగింది.
– తెలుకల బొనమాళి, టీ కొట్టు యజమాని, ఈదుపురం
ఒత్తిడి నుంచి ఉపశమనం
పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే చాయ్ తాగడం తప్పనిసరి. స్నేహితులు కలిసినా, సహోద్యోగులు కలసినా తప్పని సరిగా చాయ్ ఆఫర్ చేస్తా. ముఖ్యంగా ఇచ్ఛాపురంలో దొరి కే చాయ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
– వి.శ్రీనివాసరావు, ఉద్యోగి, గృహనిర్మాణశాఖ
టీ మంచిదే..
టీ చాలా మంచిదే. ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే పరిమితంగా తాగడం అల వాటు చేసుకోవాలి. షుగర్ పేషెంట్లు షుగర్ లెస్ టీ తాగాలి.
– డాక్టర్ మహంతి చంద్రశేఖర్‌నాయుడు, సీహెచ్‌సీ సూపరింటెండెంట్, రాజాం
ఒక్క టీ కొడితే..
నేను ఇప్పటివరకూ వెయ్యికి పైగా కవితలు, రచనలు చేశాను. నా రచనలు, కవితల సమయాల్లో చిన్న టీ తాగితే చాలు అదో తృప్తి. ఒక్కో దఫా టీ తాగి కూర్చుని తెల్లపేపరు తీశానంటే ఎన్నో కొత్త అక్షరాలు, కొత్త పదాలు వచ్చి చేరుతాయి. దటీజ్ టీ మహత్యం.
– కుదమ తిరుమలరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రాజాం.
అతిగా వద్దు..
రిలాక్స్ కోసమంటూ టీని అతిగా తాగినా అనర్థాలు వస్తాయి. చాయ్‌కి బానిస కావద్దు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగ డం ద్వారా బీపీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. గ్రీన్ టీ తాగడం మంచిదే కాని, ఏదైనా ఎక్కువగా తీసుకోకుండా మోతాదులో తీసుకుంటే మంచిది.
– డాక్టర్ ఉలాల శేషు యాదవ్, ఎండీ, మహాలక్ష్మి నర్సింగ్ హోమ్, ఇచ్ఛాపురం
Comments
Please login to add a commentAdd a comment