ప్యాకేజీ కరపత్రాలను అవిష్కరిస్తున్న ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్‌సత్య, ఏఎం మురళీకృష్ణ
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టూరిజం) జీపీ కిషోర్‌సత్య తెలిపారు. బుధవారం విజయవాడలోని రైల్వే స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘మహాలయ పిండదాన్’ పేరుతో వారణాసి, ప్రయాగ్ సంగం, గయా ప్రాంతాలు చుట్టివచ్చేలా ఐదు రాత్రులు, ఆరు రోజుల ప్యాకేజీతో రైలును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15వ తేదీన ఈ రైలు బయలుదేరి..20వ తేదీ గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఏఎం మురళీకృష్ణతో కలిసి ప్యాకేజీ కరపత్రాలను ఆవిష్కరించారు.
మాత వైష్ణోదేవి యాత్ర..
స్వదేశీ దర్శన్ పేరుతో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్‌సర్‌లో పర్యటించేలా ప్రత్యేక రైలు ప్యాకేజీలను రూపొందించామని కిషోర్‌సత్య తెలిపారు. మే 27వ తేదీన తిరుపతి–రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు జూన్ 3వ తేదీనమ గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కేరళ, తమిళనాడు, ఉత్తరాఖాండ్, నేపాల్, తిరుపతికి విమాన ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్, 9701360675, 9701360701 నంబర్లలో సంప్రదించాలని కిషోర్‌సత్య సూచించారు.
విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (07433) ఈ నెల 15న రాత్రి 7.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07434) ఈ నెల 16న రాత్రి 8.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. నాందేడ్–విశాఖపట్నం (07082) రైలు ఈ నెల 15న సాయంత్రం 4.35 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07083) 17న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment