ఆ ఊరెళ్లి పోలీసు ఇల్లెక్కడ అంటే సరిపోదు. ఇంటి పేరు చెప్పినా చాలదు. ఎందుకంటే ఆ ఊరంతా పోలీసులే మరి. ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులనుకుంటే పొరబడినట్టే. ఊరి దేవతపైన భక్తితో కొవ్వాడ మత్స్యలేశం వాసులు తమ పేరు తరతరాలుగా ‘పోలీసు’ అనే పెట్టుకుంటున్నారు. ఆడ, మగ తేడా లేకుండా ఓ తరం వారైతే అందరికీ అదే పేరును పెట్టేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కొత్త పేర్లు ఊరికి పరిచయం అవుతున్నా.. ‘పోలీసు’ నామాన్ని మాత్రం నామమాత్రంగా ఊయలలో వేసేటప్పుడైనా పెడుతుంటారు.
రణస్థలం(శ్రీకాకుళం జిల్లా): కొవ్వాడ మత్స్యలేశం.. ఈ పేరు వింటే అణువిద్యుత్ పార్కు నిర్మాణం అందరికీ గుర్తుకు వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టు రాక మునుపు కూడా ఈ ఊరు ‘పేరు’తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ పంచాయతీలో ప్రతి ఇంట్లో ఇద్దరు... ముగ్గురు ‘పోలీసు’లే ఉన్నారు. అమ్మ, నాన్న, పిల్లలు అందరూ పోలీసులే. తరాలు మారినా ఈ అలవాటు మాత్రం పోలేదు. ఈ పంచాయతీ జనాభా 5వేలు పైచిలుకు. ఓటర్లు 3100 వరకు ఉంటారు. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులే నివసిస్తుంటారు. చేపల వేట వీరి జీవనాధారం. గ్రామ దేవత పోలేరమ్మ వీళ్ల గ్రామానికి రక్షణ. అమె కరుణాకటాక్షం నిత్యం ఉండాలని ఆమె పేరునే గ్రామస్తులు పెట్టుకుంటారు.
పోలేరమ్మే రక్ష
కొవ్వాడ గ్రామస్తులు వందల ఏళ్ల నుంచి పోలేరమ్మను కొలుస్తున్నారు. ఏటా ఏప్రిల్ మాసంలో గ్రామ దేవత పండుగ ఘనంగా జరుపుతుంటారు. వీరంతా మత్స్యకారులు కావడంతో సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఎలాంటి ఆపద రాకూడదని అమ్మవారిని నిత్యం పూజలు చేస్తుంటారు. కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని ఆ తల్లికే మొక్కుతుంటారు. దీంతో అమ్మవారి పేరు కలిసి వచ్చేలా పుట్టే పిల్లలకు ‘పోలీసు’ అని పేరు పెట్టడం కొన్ని తరాల ముందు మొదలైంది.
ఇలా పేరు పెట్టుకుంటే ఎలాంటి చెడు జరగదని వీరి నమ్మకం. ఈ పద్ధతి ఇప్పటి తరం వరకు కూడా కొనసాగుతోంది. ఈ గ్రామంలో నివసించే సగం మందికి పైగా పేర్లు పోలీసులే. అమ్మ పేరు పోలీసమ్మ, నాన్న పేరు పోలీసు, కొడుకు పేరూ పోలీసు అనే చాలా మందికి ఉంటుంది. ఇటీవల పిల్లల పేర్లు సరికొత్తగా పెట్టుకుంటున్నా.. మొదటి ఊయలలో వేసేటప్పుడు పేరు మాత్రం పోలీసు, పోలీసమ్మే.
గ్రామ దేవత పేరునే..
మా గ్రామ దేవతైన పోలేరమ్మ పేరునే మేమంతా పెట్టుకుంటాం. నేటి తరం యువత మోడరన్ కాబట్టి వివిధ పేర్లుగా మార్చుకున్నారు. మా చిన్నతనం చాలా ఇబ్బందిగా ఉండేంది. గ్రామంలో ప్రస్తుతం 100మందికి పైగా పోలీసుల పేర్లు ఉన్నాయి.
– మైలపల్లి పోలీసు, మాజీ సర్పంచ్
మరి ఎలా పిలుస్తారు..?
ఊరంతా పోలీసులే అయితే అందరినీ ఎలా పిలుస్తారనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఇంటి పేరునో, మనిషి తీరునో బట్టి పొట్టి, పొడుగు, సన్నం, లావు వంటి ప్రత్యేక గుర్తులతో పిలుస్తుంటారు. గ్రామంలోకి కొత్తగా వెళ్లిన అధికారులకు ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఓటరు జాబితా తయారులోనూ చిక్కులు తప్పవు. ఇతర ప్రాంతాలైన గుజరాత్, వీరావళి, చెన్నై, బెంగళూరులకు వలసలు వెళ్లినప్పుడు వీళ్ల పేరు పోలీసుగా ఉండటంతో ఆక్కడ పోలీసులు, స్థానికులతో తీవ్ర చిక్కులు వచ్చేవని చెబుతుంటారు. అణు విద్యుత్ పరిహారం చెల్లింపులోనూ వీరి పేర్లతో తంటాలు తప్పలేదు.
దేవత ఆశీస్సులుండాలి
మా గ్రామ దేవత అశీస్సులు ఉండాలనే ఇలా పేరు పెట్టుకుంటాం. పేరులో ఏముంది ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి గానీ.
– సూరాడ పోలీసమ్మ
8 మంది పోలీసులు
మా కుటుంబంలో పేర్లన్నీ పోలీసులే. మా పిల్లలు, మా వదిన, నా పేరు ఇలా మా కుటుంబంలో 8 మంది పోలీసుల పేరుతో ఉన్నారు. మా ఇంటి పేరును కలుపుకొని జనపమ్మ పోలీసుగానే అందరినీ పిలుస్తారు.
– జనపమ్మ గారి పోలీసు
మంచి జరగాలని
మా ఊరి వారికి అంతా మంచే జరగాలని మా పెద్దలు పోలీస్ పేరును పెడుతున్నారు. ప్రస్తుతం స్కూల్లో రికార్డుల పరంగా పదిమంది వరకు ఉన్నారు. గతంలో ఎక్కువ మంది ఉండేవారు.
– మైలపల్లి పోలీసు, కొవ్వాడ హైస్కూలు స్కూల్ కమిటీ చైర్మన్
చదవండి: బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! ఏకంగా 33 కేసులు
Comments
Please login to add a commentAdd a comment