సాక్షి, అమరావతి : ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణంలో స్వఛ్చతా హీరో కార్యక్రమం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్‌ఎమ్‌సి)తో కోకో కోలాకు చెందిన బాట్లింగ్ భాగస్వామి శ్రీ సర్వారాయా సుగర్స్ లిమిటెడ్‌లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. కేంద్రప్రభుత్వ స్వఛ్చ భారత్ మిషన్ స్ఫూర్తిగా దీన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు పౌరులనూ భాగస్వాములను చేయడం అవసరమని ఈ కార్యక్రమం ద్వారా చెబుతున్నామన్నారు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు.. వ్యర్ధాల విభజనపై అవగాహన పెంచడం, ప్రజల థృక్పధాలలో మార్పు తీసుకురావడం కూడా ఈ కార్యక్రమంలో భాగమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్లినెస్ డ్రైవ్ చేపడతామని వీరు చెప్పారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ కోసం స్థానికంగా ఉన్న శక్తి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్‌కు అందజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పలు బ్రాండెడ్ కియోస్క్‌లు, సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరంలోని 50 వార్డులలో కలెక్షన్ వ్యాన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను తీసుకుని జ్యూట్ బ్యాగులను ఉచితంగా ఇవ్వడం వంటి ఆకర్షణీయమైన ప్రచారంతో ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ కార్యక్రమం ఊపందుకుంది. తొలిదశ కార్యక్రమంలో భాగంగా నిర్ణీత 35 రోజులలో మురికివాడలు, కాలనీల నుంచి ఇప్పటికే 5టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించామని అంటే సగటున రోజుకి 150 కిలోలు సేకరించినట్టు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, దీనిలో పాల్గొన్నవారు సదరు ఛాయా చిత్రాలను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పంచుకుంటూ సోషల్ మీడియా ద్వారా మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మునిసిపల్ అధికారి హెల్త్ ఆఫీసర్ డా.ఎ.వినూత్న మాట్లాడుతూ పరిశుభ్రత, బాధ్యతాయుతంగా వ్యర్ధాలను పారవేయడం అనేవి మనం రోజువారీ జీవితంలో క్రమశిక్షణగా అలవరచుకోవాల్సిన విషయాలు. వ్యర్ధాల నిర్వహణ చుట్టూ అల్లుకున్న సవాళ్లను అధిగమించడానికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలి’’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment