ఇరుకు రోడ్డులో సభ నిర్వహిస్తున్న చంద్రబాబు
సాక్షిప్రతినిధి, కాకినాడ: ఇరుకు సందులో సభ నిర్వహించడం ద్వారా మొన్న కందుకూరులో ఎనిమిది మంది మృత్యువాత పడటానికి కారణమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడులో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రజలు ఏమైపోతేనేం తనకు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం రావాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఎక్కడ సభలు నిర్వహించినా జనం రావడం లేదు.
చిన్నా చితక లీడర్లను బతిమాలి, బెదిరించడం ద్వారా వెయ్యి మందిని రప్పించాలనుకుంటే తీరా వంద మందిని సమీకరించడం కూడా గగనమైపోతోంది. బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో సభలు నిర్వహిస్తే జనం కనిపించక.. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండటంతో పరువు పోతోంది. దీంతో చిన్నపాటి సందులను ఎంచుకుని సభలు నిర్వహిస్తూ.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం ద్వారా ఎక్కువ మంది వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలో తోపులాటలు చోటుచేసుకుని జనం ప్రాణాలమీదకు వస్తోంది. అయితే ఇవేమీ పట్టనట్లు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ఇటీవల పాదయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా ఇదే బాట ఎంచుకున్నారు. తొలుత ఒకటి.. రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో సభలు నిర్వహించినప్పుడు జనం లేక వెలవెలబోవడంతో తండ్రిబాటలోనే పయనిస్తున్నారు.
ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇరుకు సందుల్లో సభలొద్దని జీవో–1ను జారీ చేసిన ప్రభుత్వంపై, పోలీసులపై నోరు పారేసుకుంటూ.. సీఎం జగన్‌ను ఇష్టానుసారం తిడుతూ తండ్రీకొడుకులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ‘ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ’ పేరుతో నిర్వహించతలపెట్టిన సభను బహిరంగ ప్రదేశంలో పెట్టుకోవాలని చెప్పిన పోలీసులపై దౌర్జన్యానికి దిగారు.
అనపర్తిలో టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనం అద్దాన్ని ధ్వంసం చేసిన దృశ్యం
పోలీసులపై దౌర్జన్యం
‘అనపర్తిలో ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు బహిరంగ సభ కోసం అనుమతికావాలని ఆ పార్టీ నేతలు కోరారు. పోలీస్‌యాక్ట్ , జీవో నంబర్–1ను అనుసరించి రోడ్డుపై సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పాం. వారి సభ నిర్వహణకు అనుకూలంగా ఉండేలా కళాక్షేత్రంతో పాటు, ఒక లే అవుట్‌ను సూచించాం. అక్కడ పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పాం. అయినా వారు మా మాట వినిపించుకోకుండా రోడ్డుపై సభ పెట్టారు. ఇటు పోలీసులు, అటు ప్రజలకు ఇబ్బంది కలిగించారు’ అని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు.
దీన్నిబట్టి ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు అలజడి సృష్టించాలని, ఘర్షణ ధోరణి అవలంబించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారని స్పష్టమవుతోంది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి వేట్లపాలెం కెనాల్ రోడ్డు మీదుగా రోడ్‌షోతో చంద్రబాబు అనపర్తి వైపు బయలుదేరారు. పోలీసులు వాహనాలను నిలుపుదల చేసే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు, టీడీపీ నాయకులను ఉసిగొల్పారు. వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
ఒక్కసారిగా రెచ్చిపోయి దౌర్జన్యంగా పోలీసులను తోసేశారు. దీంతో పలువురు పోలీసులు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లను ఎత్తి పడేశారు. దీంతో పోలీసులు నేలపై కూర్చుని బతిమిలాడారు. అయినా చంద్రబాబు వినిపించుకోకుండా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి వాహనాలతో ముందుకు కదిలారు. లక్ష్మీనరసాపురంలో పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టారు.
కారులో ఉన్న చంద్రబాబు కిందకు దిగి.. అక్కడే ఉన్న మీడియా వాహనాన్ని ముందుకు పిలిపించి ఆ వాహనం పైకి ఎక్కి మాట్లాడారు. మాకు అనుమతి ఉంది, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామని రెచ్చగొట్టడంతో పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అనపర్తి దేవీచౌక్ సెంటర్‌కు చేరుకుని సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment