అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖ గాజువాకలో టీడీపీ కార్పొరేటర్ ముఖ్య అనుచరుడు చీటీల పేరిట సుమారు 500 మందిని రూ. 30 కోట్లకు ముంచేసిన వైనం బయటపడింది. అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా జీవితాన్ని మొదలెట్టి, భారీ మొత్తంలో చీటీలు కట్టించిన అతను.. చివరకు కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు శుక్రవారం గాజువాక పోలీసుల్ని ఆశ్రయించారు.
ఏసీపీ త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక వాంబే కాలనీకి చెందిన మరడాన పరశురాం 65వ వార్డు టీడీపీ కార్పొరేటర్ బొడ్డు నర్సింహ పాత్రుడు(కేబుల్ మూర్తి)కి ముఖ్య అనుచరుడు. పరశురాం 12 ఏళ్ల క్రితం అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత చిన్నచిన్న చీటీలు ప్రారంభించాడు. వాటిని నెమ్మదిగా పెంచుకుంటూ రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 25 లక్షల వరకు తీసుకువెళ్లాడు. నమ్మకంగా ఉండటంతో ఎక్కువ మంది ఇతని వద్దే చీటీలు వేసేవారు.
ఈ చీటీల నిర్వహణలో పరశురాంతో పాటు భార్య కుమారి, అన్నయ్య సత్తిబాబు, వదిన జ్యోతి, మేనల్లుడు ధనుంజయ్, అక్క చంద్ర, మామయ్యలు పాలు పంచుకొనేవారు. దీంతో పాటు పప్పుల చీటీలు, వరలక్ష్మీ వ్రతం కార్డులు, కిరాణా లక్కీ డ్రాలు వంటి స్కీములను కూడా నడిపారు. ఇటీవలి కాలంలో చీటీలు, స్కీముల పేరుతో అందరి నుంచి రూ. 30 కోట్ల వరకు వసూలు చేసి, పరారయ్యారు. ఈ విషయం శుక్రవారం బయటపడటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.లక్షల్లో నష్టపోయినట్లు పలువురు బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంత మొత్తమో నిర్ధారించి, శనివారం కేసు నమోదు చేస్తామని ఏసీపీ త్రినాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment