నవంబర్ 1తోనే ఆంధ్రకు బ్రాండ్ ఇమేజ్ అన్న కేంద్రం
ఆ రోజే వేడుకలు నిర్వహించుకోవాలని గతంలోనే వెల్లడి
ఇప్పుడు కూడా రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా
కానీ, కనీసం పొట్టి శ్రీరాములుకు నివాళి కూడా అర్పించని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
2014 నుంచి 2018 వరకు ఈ వేడుకలు జరపని టీడీపీ సర్కారు
2019 నుంచి ఘనంగా జరిపిన వైఎస్ జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: నవంబరు 1.. ఎంతో విశిష్టత కలిగిన రాష్ట్ర అవరతణ దినోత్సవానికి టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దినోత్సవాలకు అప్పట్లోనే స్వస్తి పలికింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబరు 1నే నిర్వహించాలని, తద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పరిరక్షించినట్లవుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ గత చంద్రబాబు ప్రభుత్వం దానిని గాలికొదిలేసింది.
అయితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ నవంబరు 1నే రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా.. రాజ్‌భవన్ దగ్గర నుంచి గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు అన్నిచోట్ల జాతీయ పతాకాన్ని ఎగరవేసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమాలకు దూరంగా ఉంది.
టీడీపీ–జనసేన ఇలా.. బీజేపీ అలా..
మరోవైపు.. రాష్ట్రావతరణ దినోత్సవంపై కూటమిలోని పార్టీలు పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబించాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ వేడుకలకు దూరంగా ఉండడంతోపాటు రాష్ట్రావతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కనీసం నివాళులు కూడా అర్పించలేదు.
కానీ, బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అనేకమంది బీజీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా నవంబరు 1 ప్రాముఖ్యాన్ని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సర్కారుపై నెటిజన్ల ఫైర్..
ఈ నేపథ్యంలో.. రాష్ట్రావతరణ వేడుకలకు చంద్రబాబు సర్కారు మంగళం పాడటంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దేశంలో రాష్ట్రావతరణ దినోత్సవం లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారుచేయడంతోపాటు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని ఘోరంగా అవమానించారంటూ వారు సర్కారును ఎండగడుతున్నారు.
పొట్టి శ్రీరాములును చంద్రబాబు అవమానించారు
» వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
»పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, అమరావతి: ఆత్మబలిదానంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములును అవమానించేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబరు 1న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని 2014–19 మధ్య కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించలేదని తెలిపారు.
2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పడగా, ఏటా ఆ రోజున చంద్రబాబు ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష పేరుతో నాటకమాడిందని, ఇందుకు రూ.80 కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించకపోవడం పొట్టి శ్రీరాములుతో పాటు ఆర్యవైశ్య జాతినే అవమానించడమని అన్నారు. ఆర్యవైశ్యులను అవమానించే చింతామణి నాటకాన్ని ఆ జాతి ప్రతినిధుల కోరిక వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే ఊరుకొనేది లేదని వెలంపల్లి హెచ్చరించారు.
టీటీడీ బోర్డు సభ్యులుగా పనికిమాలిన వారికి స్థానం కల్పించారని చెప్పారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు కారకుడయ్యాడని, ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా అమరజీవి ఆత్మ త్యాగానికి తూట్లు పొడిచాడని మల్లాది విష్ణు ఆక్షేపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment