పనులు సాగాలంటే రూ.30 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపులు
కమీషన్ ముట్టజెప్పేంతవరకూ పనులు చేపట్టొద్దు
పులివెందులకు చెందిన కీలక నేత హుకుం
తమకు ముడుపులు ఇవ్వకపోవడంతో వేల్పుల వద్ద పనుల అడ్డగింత
గతంలో ఇలాంటిదే జరిగితే వెంటనే స్పందించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం వచ్చిందే తడవుగా టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. అభివృద్ధి పనుల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. పనులు చేస్తోంది.. జాతీయ స్థాయి సంస్థలైనా సరే తమకేంటన్నట్టు చెలరేగుతున్నారు.
తాజాగా వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తున్న దిలీప్ దిల్కాన్ సంస్థకు తాజాగా ఇలాంటి దుస్థితే వైఎస్సార్ జిల్లాలో ఎదురైంది. టీడీపీ నాయకుల దాదాగిరితో రోడ్డు పనులు నిలిపేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొడికొండ చెక్‌పోస్టు నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు మంజూరైంది. అందులో మూడు ప్యాకేజీల పనులు దిలీప్ దిల్కాన్ సంస్థకు దక్కాయి. మరో మూడు ప్యాకేజీలు మెగా కంపెనీకి లభించాయి.
ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.700 కోట్లతో ఒక ప్యాకేజీ పనులను దిలీప్ దిల్కాన్ సంస్థ చేపట్టింది. ఇంతకాలం ఆ పనులు శరవేగంగా కొనసాగించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దౌర్జన్యకర పరిస్థితులు ఆ సంస్థకు కూడా ఎదురయ్యాయి. వేల్పుల గ్రామం వద్ద చేపడుతున్న పనుల వద్దకు వేముల మండలంలో క్రియాశీలకంగా వ్యవహరించే టీడీపీ నేత వెళ్లారు. పనులు నిలిపేయాలని, లేదంటే వెంటనే మీ జీఎంను వచ్చి కలవమని చెప్పండంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆ సంస్థ పర్సనల్ ఇన్‌చార్జి వచ్చి ఆ నాయకుడితో సమావేశమయ్యారు.
ఈ మొత్తం వ్యవహారం మూడు రోజుల క్రితం నడిచినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ కీలక నాయకుడితో సదరు నేత ఫోన్‌లో మాట్లాడించారు. మీ పనులు సజావుగా కొనసాగాలంటే రూ.30 కోట్లు తనకు చెల్లించాలని ఆ కీలక నాయకుడు డిమాండ్ చేశారు. ‘ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తనకు రూ.30 కోట్లు చెల్లిస్తేనే పనులు కొనసాగుతాయి’ అని తేల్చిచెప్పారు. మూడు రోజుల్లోగా మీ నిర్ణయం ఏంటో చెప్పాలని వేముల మండల నాయకుడు సంస్థ ప్రతినిధిని హెచ్చరించాడు.
పనులను నిలిపేయించిన టీడీపీ నేతలు..
దిలీప్ దిల్కాన్ సంస్థకు చెందిన పనులను బుధవారం సాయంత్రం వేముల మండలం వేల్పుల గ్రామం వద్ద టీడీపీ నేతలు నిలిపేశారు. ప్రశ్నించిన సంస్థ ప్రతినిధులకు మీకు ఇచ్చిన గడువు ముగిసిందని, మీ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు కాబట్టే పనులు నిలిపేస్తున్నామని దాదాగిరి చేశారు.
తమకు రూ.30 కోట్లు ఇచ్చేవరకు పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. జిల్లాలో ఇదివరకు ఇలాంటి ఘటన చక్రాయపేట కేంద్రంగా ఓ సంస్థకు ఉత్పన్నమైతే అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాంట్రాక్టు సంస్థలకు ఆటంకాలు లేకుండా సత్వర చర్యలు చేపట్టింది.
బెదిరింపులతో టీడీపీ నేతల స్వైరవిహారం..
టీడీపీ అధికారంలోకి రావడం ఆలస్యం వ్యక్తుల ఆస్తులు, వ్యాపారాలను చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఓ వ్యాపారికి చెందిన రెండు మద్యం బార్‌లను తమకు అప్పగించాలని టీడీపీ నేతలు బెదిరించారు. అలాగే వేంపల్లె కేంద్రంగా పోటాపోటీగా పొక్లెయిన్లు పెట్టి టిప్పర్లతో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.
ఆయా వ్యక్తులకు చెందిన ప్రైవేటు స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు. కోర్టులో ఉన్న వ్యవహారాల్లో సైతం తలదూర్చి సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. మునుపెన్నడూ ఇలాంటి అధ్వాన పరిస్థితులు చూడలేదని పాతతరం టీడీపీ నాయకులు సైతం వాపోతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment