
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ కబ్జాదారుల చేతుల్లో మోసపోయిన బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ నేతలు కబ్జా చేసిన తమ భూముల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఇదే ప్రాంతంలో బుధవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర ముగింపు సభ జరుగుతోంది. ‘అయ్యా చంద్రబాబు, లోకేశ్.. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తప్పుడు పత్రాలు, ఫోర్జీరీ సంతకాలతో మా భూములు కాజేశారు.
ప్రశ్నిస్తే అధికార బలంతో అప్పట్లో మారణాయుధాలతో దాడిచేశారు. మమ్మల్ని భయపెట్టారు. ఇప్పుడు అక్కడే పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ప్రజలకు మేలు చేసే వారే అయితే తక్షణమే మా భూములను అప్పగించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి’ అంటూ బాధితులు ఆందోళన చేశారు. ప్రశ్నిస్తాను అంటూ చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ సమస్యపై టీడీపీ నాయకులను ప్రశ్నించాలని కోరారు. పోలిపల్లికి చెందిన భూమి యజమాని తిరుమారెడ్డి ఆదినారాయణ వారసులు సుమారు 30 మంది మంగళవారం ఉదయం ఆ భూమిలోకి వెళ్లి నిరసన తెలిపారు.
టీడీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు, మద్దతుదారులు తమకు వారసత్వంగా చెందాల్సిన సుమారు 73.58 ఎకరాలను ఫేక్ పట్టాదారు పుస్తకాలు, అధికారుల ఫోర్జరీ సంతకాలు, అక్రమ రిజిస్ట్రేషన్లతో కబ్జా చేశారని ఆరోపించారు. తమకే చెందిన మరో 1.74 ఎకరాల భూమి 2000 సంవత్సరంలో జాతీయ రహదారి విస్తరణలో పోయిందని, ఆ పరిహారం సుమారు రూ.18 లక్షలు కూడా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు సోదరుడు, భోగాపురం మండల టీడీపీ అధ్యక్షుడైన కర్రోతు సత్యనారాయణ తప్పుడు పత్రాలతో కాజేశారని వాపోయారు.
అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలతో 3.02 ఎకరాల భూమిని సైతం సత్యనారాయణ ఆక్రమించాడని చెప్పారు. ఇదే అదనుగా మరికొందరు టీడీపీ నాయకులు కొందరు బినామీల పేర్లతో 10 ఎకరాలు, మరికొందరు బినామీల పేర్లతో 60.55 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. తమ భూమిని తమకిచ్చేయాలని కోరిన తమపై మారణాయుధాలతో దాడి చేశారని తెలిపారు. అప్పటి టీడీపీ పాలనలో ఓ పోలీస్ అధికారి ఆక్రమణదారులకే సహకరించారని ఆరోపించారు.
పొలిపల్లిలో యువగళం ముగింపు సభకు ఏర్పాట్లు
తర్వాత ఆయన భార్య, బావమరిది పేర్లతో దాదాపు నాలుగు ఎకరాలు బదలాయించుకోవడమే అందుకు సాక్ష్యమని చెప్పారు. ఆ పెత్తందారులు ఇన్నాళ్లూ తమను భయపెట్టారని, న్యాయం కోసం ఇప్పుడు ధైర్యంగా బయటకొచ్చి పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. యువగళం సభ కోసం పోలిపల్లి వస్తున్న చంద్రబాబు, లోకేశ్ టీడీపీ కబ్జాదారులకు చెప్పి తమ భూమి తమకు తిరిగి ఇప్పించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కూడా తమ సమస్యపై స్పందించాలన్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నేడు యువగళం ముగింపు సభ
బుధవారం లోకేశ్ పాదయాత్ర ముగింపు సభ కోసం పోలిపల్లిలో ఓ ప్రవేట్ సంస్థ లేఅవుట్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భారీ వేదిక నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు, వాహనాల్లో జనాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కోసం లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు రిసార్ట్స్‌కు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.